AP CS Jawahar Reddy Review: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయమైన కలెక్టరేట్లు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు 982 పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తి అయిందని అన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంత మేరకు బదిలీలు జరగాల్సి ఉందని ఒకటి రెండు రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
రాష్ట్ర సరిహద్దులతో పాటు అంతర్గతంగానూ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. ఇప్పటికే 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 20 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ప్రత్యేకంగా పోలీసు శాఖ 62 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, అటవీ శాఖలు కూడా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.