CM Chandrababu Instructions to Ministers: రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని విషయాలు బయటకు చెప్పలేమన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండకూడదన్నారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందన్న చంద్రబాబు, ఈ 3 నెలల్లో కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని తెలిపారు.
దాదాపు 80లక్షల టన్నులు బోట్ సొసైటీలు, నదుల్లో పూడిక తీయటం ద్వారా వస్తుందన్నారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయని తెలిపారు. తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానుంది. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును ఈ అసెంబ్లీలో పెడదామని, ఇది ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారు: గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసగించిందని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 1600 కోట్లు రుణం తెచ్చి వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారు, మిగిలిన 600 కోట్లు ఏమైందో ఇంకా తెలియట్లేదన్నారు. ధాన్యం సేకరంపైనా , పౌర సరఫరాల కార్పొరేషన్ తో పాటు వ్యవసాయ శాఖ సేకరణ అంశంపైనా చర్చ జరగాలని కోరారు. దీనిపై సమగ్ర వివరాలు 2 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారన్న చంద్రబాబు, క్షేత్రస్థాయి సమాచారం వేగంగా తీసుకురావడం లేదని మండిపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం - Land Titling Act Repeal
గనులు, భూకబ్జాల అంశంపై కమిటీల వేయటమా లేక మరేం చేద్దామో నిర్ణయిద్దామన్నారు. ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దని హితవుపలికారు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ అని, ఈ ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో రూ.43కు ఎగుమతి చేశారని ఆక్షేపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే మంత్రివర్గం కల్లా ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో రావాలని నిర్ణయించారు.
ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు: సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. తాను ఇవాళ్టికీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, ఇంకా తనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. కొత్త వాళ్లు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారని, సబ్జెక్టులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు పనిచేయాలన్నారు. ఆగస్టు 1న ఇళ్ల వద్ద ఫించన్ పంపిణీలో పాల్గొందామని పిలుపునిచ్చారు.
నెల నెలా సమీక్షలు చేపట్టాలి: ఏటా 35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం వెళ్లి ఇవ్వటం బాగుంటుందన్నారు. అన్న కాంటీన్లు 100 అయినా ఆగస్టులో ప్రారంభిద్దామన్నారు. ఆర్ధిక సమస్యలెన్నో ఉన్నాయి, ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ముందుకెళదామని వివరించారు. నెల రోజుల మంత్రుల పని తీరుపై చర్చించారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. హెచ్వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు.