తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఏపీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు - AP BJP MP Candidates 2024 - AP BJP MP CANDIDATES 2024

AP BJP MP Candidates List 2024 : ఏపీలో ఆరు లోక్‌సభ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. జాబితాలో అనూహ్యంగా ముగ్గురికి చోటు దక్కింది. టికెట్‌ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు నిరాశ ఎదురైంది. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వెంటనే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుకు తిరుపతి లోక్​సభ టికెట్​ లభించింది.

AP lok sabha elections 2024
AP BJP MP Candidates List 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 9:51 AM IST

ఏపీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు

AP BJP MP Candidates List 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం ప్రకటించింది. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరూ ఊహించని విధంగా టికెట్లు దక్కించుకున్నారు. రాజమహేంద్రవరం టికెట్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు దక్కింది.

ఈ ఆరుగురిలో శ్రీనివాస వర్మ తప్ప మిగతా అయిదుగురు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారే. బీజేపీ టికెట్‌ దక్కినవారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎంపీలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. బీజేపీ నుంచి లోక్‌సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు రత్న ప్రభ, దాసరి శ్రీనివాసులు ఉన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ, రాజంపేట నుంచి టీడీపీ పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించాయి.

AP Lok Sabha Elections 2024 : కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోసం రాజంపేట సీటు తమకిచ్చి, విజయనగరం టీడీపీ తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదించింది. దానికి టీడీపీ సమ్మతించింది. పొత్తు చర్చలు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు రాజం పేటకు కిరణ్‌ పేరు ప్రచారంలోకి వచ్చినా, ఆ సీటు టీడీపీకి వెళ్లడంతో ఇక ఆయనకు టికెట్‌ లేదని అందరూ భావించారు. అనంతరం రెండు పార్టీల మధ్య జరిగిన సంప్రదింపుల్లో సీట్లు పరస్పరం మార్చుకునేందుకు అంగీకారం కుదరడంతో కిరణ్‌కు మార్గం సుగమమైంది.

నరసాపురం లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ, జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే ఉంది. రెండు మూడు రోజుల నుంచే ఆయనకు టికెట్‌ ఇవ్వడం లేదని, శ్రీనివాసవర్మకు ఇస్తున్నారని సూచనలు వచ్చాయి. ఇది పూర్తిగా అనూహ్యం. దీనిపై నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న మిత్రపక్షాల అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.

సాక్షి పత్రికపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా - నోటీసులు పంపిన పురందేశ్వరి - Defamation Suit Notice To Sakshi

అనూహ్యంగా ముగ్గురికి బీజేపీ సీట్లు: తిరుపతి లోక్‌సభ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆదివారమే బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన రోజే ఆయన అనూహ్యంగా తిరుపతి లోక్‌సభ టికెట్‌ దక్కించుకున్నారు. ఆయన తమిళనాడు క్యాడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. 2009లో ప్రజారాజ్యం తరఫున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

ఈ ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్‌ ఇచ్చే అవకాశాల్లేవని తెలిసిపోవడంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. చివరకు అనూహ్యంగా బీజేపీలో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభతో పాటు, మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా ఈసారి టికెట్ ఆశించారు.

రాజంపేట అభ్యర్థిగా మాజీ సీఎం :నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 నుంచి 2009 మధ్య నాలుగుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గాను పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి 'జై సమైక్యాంధ్ర' పేరుతో సొంతంగా పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.

ఆ తర్వాత చాలాకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నరసాపురం టికెట్‌ దక్కించుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ 2009లో నరసాపురం లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పని చేశారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా బీజేపీలో వివిధ పదవులు నిర్వర్తించారు. విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు.

ఊహించినట్టే పురందేశ్వరికి టికెట్ : పురందేశ్వరి, కొత్తపల్లి గీత, సీఎం రమేశ్‌లకు టికెట్‌లు వస్తాయన్నది అందరూ ఊహించిందే. పురందేశ్వరి 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో జాతీయ స్థాయిలో ముఖ్యమైన పదవులు నిర్వహించారు.

అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. సీఎం రమేశ్‌ రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారు. రెండుసార్లు టీడీపీ ఆయనను రాజ్యసభకు పంపింది. 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎంపీగా ఆయన రెండో దఫా పదవీ కాలం వచ్చే నెల మూడో తేదీతో ముగుస్తోంది. బీజేపీ అధికారికంగా ప్రకటించకముందే అనకాపల్లి టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అరకు టికెట్‌ దక్కించుకున్న కొత్తపల్లి గీత :కొత్తపల్లి గీత గతంలో వైసీపీ అభ్యర్థిగా అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇప్పుడు అరకు టికెట్‌ దక్కించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. వాటిలో కొన్ని స్థానాలకు అభ్యర్థులుగా కొందరి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాచౌదరి పేరుని విజయవాడ పశ్చిమ స్థానానికి పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఎచ్చెర్లకు నడికుదిటి ఈశ్వర్రావు, విశాఖ ఉత్తరం స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, అనపర్తికి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కైకలూరుకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ధర్మవరానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ లేదా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బద్వేలుకు రోహన్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీటితో పాటు పాడేరు, ఆదోనీల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆదోనికి పార్థా డెంటల్‌ ఆసుపత్రి యజమాని పార్థసారధి పేరు ప్రచారంలో ఉంది.

ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop

41 ఏళ్ల చరిత్రలో 'దేవినేని ఫ్యామిలీ'కి తొలిసారిగా దక్కని టికెట్ - No TDP Ticket to Devineni Family

ABOUT THE AUTHOR

...view details