AP Cabinet Key Discussion on Polavaram Project Funds:పోలవరం ప్రాజెక్టు తాజా స్థితిగతులపై చర్చించి అవసరమైన నిధుల విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేయడమే ప్రధాన ఎజెండాగా గురువారం మంత్రిమండలి సమావేశమై చర్చించింది. ప్రధానంగా నాలుగు అంశాలతో తీర్మానాన్ని ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ స్థాయిలో నీరు నిలబెట్టేలా, డీపీఆర్ ప్రకారం మొత్తం అన్ని ప్రయోజనాలూ దక్కేలా చేపట్టే పనులకు పూర్తిగా నిధులను కేంద్రమే ఇవ్వాలని తీర్మానించారు.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వరద తగ్గిపోయిన తర్వాత నవంబరు నెల నుంచి వేగంగా పనులు చేసుకునేలా అవసరమైన అనుమతులు, డిజైన్లకు అనుమతుల విషయంలో కేంద్రం సహకరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని కేంద్ర బడ్జెట్లో ప్రకటించినందుకు రాష్ట్ర మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది.
తీర్మానం ఆమోదించేందుకు ముందు పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులను కేబినెట్ సభ్యులకు సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఎంత మేర నిర్మాణం జరిగింది? ఆ తర్వాత 2019-2024 మధ్యపోలవరంప్రాజెక్టు పనులు స్తంభించిపోవడం, 2020లో భారీ వరదలకు డయాఫ్రం వాల్ ధ్వంసం అవడం, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ వల్ల వాటిల్లిన నష్టాలపై క్లుప్తంగా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.