Amit Shah Public Meeting in LB Stadium :తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని, 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామని అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
Amit Shah Telangana Tour : రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా(Social Media) ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ కమలం పార్టీని తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
మోదీ, మోదీ అని యువత నినదిస్తోందన్న అమిత్ షా, మళ్లీ మోదీకే పట్టం కడతామని మహిళలంతా అంటున్నారని తెలిపారు. ఈసారి తమకు 400 సీట్లు దాటుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందులోనూ తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రజల మద్దతుతో దిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామని షా ధీమా వ్యక్తం చేశారు. అవినీతిరహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా, మోదీ (PM Modi) పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారని కొనియాడారు.
BJP Election Campaign Strategy in Telangana :బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోదీ మరోసారి ప్రధానిగా వస్తే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా(Economic System) భారత్‌ను తీర్చిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్న హోంమంత్రి, ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూసిన రామమందిరాన్ని నిర్మించామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటేనన్న అమిత్ షా, మజ్లిస్ అజెండాతోనే హస్తం, గులాబీ పార్టీలు(BRS Party) పనిచేస్తాయని దుయ్యబట్టారు. ఆ మూడు పార్టీలు వారసత్వ పార్టీలేనని విమర్శించారు. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. పది రోజుల్లోనే పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసి ముష్కరులను మట్టుబెట్టామని, మన సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్ ప్రభుత్వం కాదని అమిత్ షా తెలిపారు.