Amit Shah Comments on Congress and BRS :రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్‌లోని కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభకు హాజరైన ఆయన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసిందని మండిపడ్డ షా, ఆ ఫేక్ వీడియోనుసీఎం రేవంత్ రెడ్డి కూడా సర్క్యులేట్ చేశారని తప్పుబట్టారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదంటూ అమిత్ షా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కమలం పార్టీ కాపాడుతుందని, ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్న అమిత్ షా, రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందన్నారు.
"కాంగ్రెస్ పార్టీ అబద్దాలను నమ్ముకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను మాట్లాడినట్లు ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ సర్క్యులేట్ చేసింది. ఆ వీడియోను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఫార్వార్డ్ చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నా అలానే తెలంగాణ దళిత, ఓబీసీ ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తేలేదు."-అమిత్‌షా, కేంద్ర హోంశాఖ మంత్రి
ఓవైసీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండింటికీ భయమే :కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ ఇద్దరినీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించినా, తమ ఓటు బ్యాంకు పోతుందని ఇద్దరూ రాలేదని గుర్తు చేశారు. ఖర్గే, రాహుల్ ఓటు బ్యాంకు, ఓవైసీ ఓటు బ్యాంకు ఒకటే అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేదని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్ ముగిసిందని, తొలి రెండు విడతల్లో కమలం పార్టీ సెంచరీ కొడుతుందని అభిప్రాయపడ్డారు.