KC Venugopal Guidelines To Congress Leaders : తెలంగాణాలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని, నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ అధిష్ఠానం సూచించింది. లోక్‌సభ ఎన్నికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు నేతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉన్న సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులతో జూమ్ ద్వారా అత్యవరసర సమవేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ భేటీకి మంత్రి దామోదర రాజనర్సింహ, 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటంపై కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. గంటకు పైగా సాగిన ఈ జూమ్ మీటింగ్‌లో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు తదితరాల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, విక్రమార్క, దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు వివరించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసహనం :నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి చూసుకుంటారని కేసీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ స్థానాన్ని నిర్లక్ష్యం చేయటం పట్ల ఇన్‌ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసీ వేణగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్దేశించారు. నియోజకవర్గంలోనే ఉండి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు.