KTR On Congress about Hydra : నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పేదలు, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అని విమర్శించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో కాదా? అని ప్రశ్నించారు. అక్రమాలన్నీ తవ్వితే బయటకు వచ్చేది కాంగ్రెస్ నేతల కుంభకోణాలే అని ఎద్దేవా చేశారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు.
కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ వాళ్లే అని, ఆ పార్టీ ఎమ్మెల్యేలవి కూలగొట్టి పేదోళ్ల వద్దకు రా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తప్పుంటే గవర్నమెంట్ నుంచి నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల కూలిన పేదల 40 వేల ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ లక్ష ఇల్లు కట్టించిందని గుర్తు చేశారు. రైతు భరోసా కాదని, ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదన్నారు. తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు అతి తెలివితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
'ఎక్కువకాలం డ్రామాలతో రాజకీయాలు సాగవు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి టాక్స్ నడుస్తోంది. హైడ్రాకు చట్టం లేదు, చుట్టరికం మాత్రమే ఉంది. పార్టీ మారిన వాళ్లు మా వాళ్లేనని సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు'- కేటీఆర్, మాజీమంత్రి
ఇప్పటివరకు రూ.4000 ఏ అవ్వకు రాలేదు : అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పిన దౌర్భాగ్యులు ఎవరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక రావడం ఖాయమని, తమ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సెల్ఫీ వీడియోలతో రైతులు తమ గోడు చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు తులం బంగారం వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారని, రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేశామని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకే న్యాయం చేయాలని హితవు పలికారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో తిరుపతిరెడ్డి ఇల్లు ముట్టలేదని, కానీ పేదోల ఇళ్లు, దుకాణాలన్నీ కూలగొట్టారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు ఏ అవ్వకు కూడా రూ.4000 పింఛన్ రాలేదని తెలిపారు.
డెడ్ లైన్ సమీపిస్తున్నా - ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? : కేటీఆర్ - KTR Tweet on MBBS Admissions
'బస్తీలకు సుస్తీ - మంచం పడుతున్న పల్లెలు - అయినా మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం'