KTR on about Musi River and Hydra : హైడ్రా కూల్చివేతలపై త్వరలోనే నగర ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడతామని కేటీఆర్ తెలిపారు. పెద్దలు, సీఎం సోదరులను వదిలి పెడతున్నారని, పేదల ఇండ్లు మాత్రం కూలుస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు తమ హయాంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీల పరిశీలనలో భాగంగా కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇవాళ ఫతేనగర్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అని, తొలగించాలనుకుంటే ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించాలంటూ కేటీఆర్ కోరారు. మూడు రోజుల కింద ఒక శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంటే మూడు రోజుల తర్వాత ఇంకో శాఖ ఇంటిని కూలగొడుతుందని తీవ్రంగా మండిపడ్డారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయి వంద శాతం శుద్ధి చేసే ఏకైక నగరంగా నిలుస్తుందని చాలా సంతోషంగా ఉందన్న కేటీఆర్, ఎస్టీపీల సందర్శనలో మొదటి అడుగు మాత్రమేనని, అన్ని ఎస్టీపీలను సందర్శిస్తామని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ పడిన తపనను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తామని కేటీఆర్ చెప్పారు. మురుగునీరు శుద్ధి అయిన తర్వాత 94 శాతం మూసీలోకి పోతుందని చెప్పారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తే మొత్తం ఎస్టీపీలు పూర్తి అవుతాయని, రూ.4000 కోట్లతో మొత్తం శుద్ధి అవుతుంటే ఈ ప్రభుత్వం మూసీ కోసం ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లు అంటోందని పేర్కొన్నారు. తమకు అనుమానాలు కలుగుతున్నాయని, మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడతామని తెలిపారు. పాకిస్థాన్ కంపెనీలకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి : కేసీఆర్ వడ్డించిన విస్తరిలో ప్రభుత్వానికి పంచభక్ష పరమాన్నాలు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టలేదన్నారని, మూసీలో ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ రూమ్‌లు ఇస్తామని ఇవాళ అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పబ్లిసిటీ స్టంటులు మానాలని, ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు రోజుల్లో సీజన్ అయిపోతోంది, రుణమాఫీ ఇవ్వాలని అన్నారు.
మరోవైపు నాలా నుంచి వచ్చే మరుగునీరు, శుద్ధి ప్రక్రియ, శుద్ధి అనంతరం నీరు, తదితరాలను పరిశీలించారు. హైడ్రా పేరిట హైడ్రామా కాదని, హైదరాబాద్ బాగు కోసం పనిచేయండని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని, ప్రభుత్వం వెంట పడతామని పేర్కొన్నారు. పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు జరుగుతున్నాయని వివరించారు.
'రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేదా సర్కస్ నడుపుతున్నారా? హైడ్రా బాధితులు ఎవరైనా బీఆర్ఎస్ను సంప్రదించాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సైతం సంప్రదించండి. బాధితులకు అండగా నిలిచి కోర్టు ద్వారా న్యాయం చేస్తాం'- కేటీఆర్, మాజీమంత్రి
ఆక్రమణలను మేం ప్రోత్సహించడం లేదు :
హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు : కేటీఆర్ - KTR VISIT FATEH NAGAR STP