Abhishek Manu Singhvi Elected to Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేయగా, రెండోది స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. అభిషేక్ మను సింఘ్వీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌లో అభిషేక్ మను సింఘ్వీ ప్రస్థానం :అభిషేక్ సింఘ్వీ సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. రెండు దఫాలు రాజ్యసభ సభ్యుడు అయ్యాయి. అవి 2006, 2018లో రెండుసార్లు ఆ హోదాను పొందారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయనను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. కానీ తెలంగాణలో రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించారు. కానీ జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్‌కు కీలకమైనందున ఆయనకే అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో సింఘ్వీ ఏకగ్రీవం : తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆగస్టు 19వ తేదీన శానససభలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కేశవరావు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చారు.