UP Meerut Lok Sabha BJP Candidate 2024 :లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి రామచంద్రప్రభు బరిలో దిగారు. రామాయణం ధారావాహికలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ మేరఠ్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సీత పాత్రధారిణి దీపిక చిఖాలియా, రావణపాత్ర పోషించిన అర్వింద్ త్రివేదిని ఎన్నికల సమరంలోకి దించిన కమలం పార్టీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్‌ను బరిలో నిలిపింది. మేరఠ్ ఆయన స్వస్థలం కావటం వల్ల అక్కడి నుంచి పోటీకి దించినట్లు తెలుస్తోంది. అరుణ్ గోవిల్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, పశ్చిమప్రాంతంలో 19 సీట్లు ఉన్నాయి. అందులో ఒకటి మేరఠ్ లోక్‌సభ నియోజకవర్గం. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ పోటీ చేస్తుండటం వల్ల మేరఠ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
"చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ఆరంభమైంది. నాకు రాజకీయాలు పూర్తిగా కొత్త. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను శాంతంగా ఉన్నాను. నాకు ఎక్కడ కూడా సమస్యలు కనిపించడం లేదు. శాంతి అనేది నా స్వభావంగా ఉండేది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. నా ఇంటికి తిరిగి వచ్చినట్లు ఉంది. అందుకే ఎక్కువ సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడి నుంచి అభ్యర్థిగా నియమించారు. నా ఊరి కోసం నా ప్రజల కోసం నేను ఏదైనా చేయగలను అనే విశ్వాసం నాకుంది. అదే నా భావన. రామ్ జీ అంతటినీ సరి చేస్తారు."
- అరుణ్ గోవిల్, మేరఠ్ బీజేపీ అభ్యర్థి
రాముడి అప్పులు-ఆస్తులు!
మేరఠ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అరుణ్ గోవిల్ ఎన్నికల అధికారికి అందించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో ఆయన స్టాక్ మార్కెట్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లుగా తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో రూ.1.22 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.16.51 లక్షలు పెట్టుబడి పెట్టారు. అలాగే రూ.14 లక్షలకుపైగా అప్పు కూడా అరుణ్ గోవిల్‌పై ఉంది. రూ.10.34 కోట్లకుపైగా నగదు ఈయన బ్యాంకు ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉంది. రూ.3.75 లక్షలు లిక్విడ్ క్యాష్‌గా తన వద్ద ఉందని అరుణ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2022లో కొన్న మెర్సిడెస్ కారు కూడా తాను వాడుతున్నానని అరుణ్ తెలిపారు. కాగా, దీని విలువ రూ.62.99 లక్షలుగా వివరించారు. ఇక రూ.10.93 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా ఉన్నట్లు చెప్పారు.
Lok Sabha Seats In UP :2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 స్థానాలకుగాను 62 చోట్ల గెలుపొందింది. ఈసారి ఎన్డీఏ కూటమి 'చార్ సౌ పార్' చేస్తుందని నినదిస్తున్న కమలనాథులు యూపీలో అత్యధిక స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
సిట్టింగ్‌ను కాదని అరుణ్ గోవిల్‌కు టికెట్!
Meerut BJP Candidate Ram Arun Govil : వరుసగా రెండు మూడుసార్లు జయభేరి మోగించిన సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చారు. అలాంటి నియోజకవర్గాల్లో మేరఠ్ కూడా ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర అగర్వాల్‌ను పక్కన పెట్టి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్‌ను కమలం పార్టీ ఎన్నికల బరిలో దించింది. సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ మేరఠ్ లోక్‌సభకు 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన హజి యాఖూబ్ ఖురేషిపై 4,729 ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీకే చెందిన మహమూద్ షాహిద్ అఖ్లక్‌పై 2.32 లక్షల మెజార్టీతో అగర్వాల్ విజయం సాధించారు.