Tamilnadu Election 2024 :2019 సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తమిళనాట పెను ప్రభంజనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో డీఎంకే కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డీఎంకే విజయదుందుభి మోగించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల తొలి విడతలోనే తమిళనాడు, పుదుచ్చేరిలో అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల ఫలితాన్నే పునరావృతం చేయాలని డీఎంకే పట్టుదలగా ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోను, అభ్యర్థులను కూడా ప్రకటించింది.
డీఎంకేకు కలిసిరానున్న అంశాలు
విపక్ష ఇండియా కూటమిలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అదే రోజున జరగనున్న ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పనకు భరోసా, పెట్టుబడుల ఆకర్షణ డీఎంకేకు కలిసిరానున్నాయి.
ముక్కుళతోర్ సామాజికవర్గానికి చెందిన పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేకు దూరంగా ఉండడం కూడా డీఎంకేకు వరంగా మారింది. పన్నీర్ సెల్వం పార్టీకి దూరంగా ఉండడం వల్ల ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో అన్నాడీఎంకే బలం కొంతమేర తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టం రద్దు, నీట్‌పై నిషేధం, ఉమ్మడి పౌరస్మృతిని తమిళనాడులో అమలు చేయబోమని చెప్పడం వంటి హామీలను డీఎంకే తాజాగా గుప్పించింది. బీజేపీ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాదరణ తగ్గకుండా చూసుకోవడంలో విజయం సాధించారు.
మాజీ సీఎంపై స్టాలిన్ మండిపాటు
మరోవైపు సంస్థాగతంగానూ డీఎంకే చాలా బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో ప్రభంజనం సృష్టించిన డీఎంకే, అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఫలితాలు సాధించాలని చూస్తోంది. బీజేపీతో అన్నాడీఎంకే రహస్య పొత్తు పెట్టుకుందని డీఎంకే పదునైన విమర్శలు చేస్తోంది. సీఏఏకి మద్దతు పలికిన మాజీ సీఎం పళనిస్వామిపై స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు.
కమల్‌కు స్టాలిన్ హామీ!
తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక స్థానం కలిపి మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థి తానేనని తనను చూసే ప్రజలు ఓట్లు వేయాలని స్టాలిన్ కోరారు. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 40 సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. డీఎంకే ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. 2018లో మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ డీఎంకే కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. 2025లో రాజ్యసభ సీటు ఇస్తామని స్టాలిన్ కమల్‌హాసన్‌కు హామీ ఇచ్చారు.
అన్నాడీఎంకే ముఖచిత్రం!
మరోవైపు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కూడా ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామి 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. కుటుంబ, వారసత్వ పాలనకు డీఎంకే కేంద్రంగా మారిందని అన్నాడీఎంకే, బీజేపీ తరచుగా విమర్శిస్తున్నాయి.