తెలంగాణ

telangana

ETV Bharat / opinion

లోక్​సభ ఎన్నికల్లో మోదీ వ్యూహం ఏమైంది? సీట్లు ఎందుకు తగ్గాయి? కారణాలు ఇవేనా? - Lok Sabha Election 2024 Result - LOK SABHA ELECTION 2024 RESULT

Reasons For BJP Lost Majority in Lok Sabha Polls : 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న టార్గెట్‌ను కాదు కదా కనీసం 300 మార్క్‌ కూడా బీజేపీ సారథ్యంలోని ఎన్​డీఏ కూటమి పొందలేకపోయింది. మరి ఎందుకిలా జరిగింది? అందుకే ఏయే కారణాలు దోహదం చేశాయి? ఈ కథనంలో చూద్దాం.

Lok Sabha Election 2024 Result
Lok Sabha Election 2024 Result (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 7:07 AM IST

Reasons For BJP Lost Majority in Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల్లో 2014, 2019 మాదిరిగా ఈసారి సొంతంగా మెజార్టీని బీజేపీ సాధించలేకపోయింది. ఎన్​డీఏ పార్టీలన్నీ కలిసి మెజార్టీ మార్క్‌ 272 స్థానాలను దాటినా చార్‌ సౌ పార్‌ లక్ష్యం కాదు కదా 300 మార్క్‌ సీట్లు కూడా కమలదళం సాధించలేకపోయింది. ఇందుకు అనేక అంశాలు ప్రభావితం చేశాయి. ఈ దఫా ఎన్నికలకు ముందు బీజేపీ నేత అనంత్‌హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామన్నారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లు అడుగుతోందని ఇండియా కూటమి పార్టీలు చేసిన ప్రచారం ఎన్​డీఏపై తీవ్ర ప్రభావం చూపింది.

రిజర్వేషన్లు రద్దు చేయబోమని బీజేపీ అగ్రనేతలు పదే పదే చెప్పినా అది పెద్దగా ప్రభావం చూపనట్లు తెలుస్తోంది. ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో గత రెండు ఎన్నికల్లోనూ వారు బీజేపీకు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ఈసారి దళితుల ఓట్లు పెద్ద ఎత్తున ఇండియా కూటమివైపు మళ్లినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లను రద్దుచేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందని విపక్షాలు చేసిన ప్రచారం మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్‌ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా పార్టీ యంత్రాంగం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది.

పార్టీల చీలక
బీజేపీ అధినాయకత్వం పలురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం ఏక్‌నాథ్‌ శిందే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా అది అప్పట్లో బయటపడలేదు. మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ వేత్త శరద్‌ పవార్‌ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. అసలు ఆ విపక్ష ప్రభుత్వాలను కొనసాగించి వుంటే వారిపై ఏర్పడే సహజ సిద్ధ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో బీజేపీకు లబ్ధి కలిగించి ఉండేది. అందుకే గతంలో మహారాష్ట్రలో 48 స్థానాల్లో 41 గెలిచిన ఎన్​డీఏఈసారి అందులో అనేక స్థానాలను చేజార్చుకుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌పవార్‌ పక్షానే ఈ ఎన్నికల్లో ప్రజలు నిలిచారు.

అగ్నివీర్ పథకం
సైనిక దళాల నియామకంలో అగ్నివీర్‌ పథకాన్ని తీసుకురావడం కూడా ఎన్​డీఏకు మైనస్‌గా మారింది. దేశంలోని యువత ప్రత్యేకించి హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, మహరాష్ట్ర, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సైనికదళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీరుచల్లుతూ అగ్నివీర్‌ పథకాన్ని తీసుకువచ్చారు. అగ్నివీర్‌ ద్వారా సైనికదళాల్లో చేరే వారిలో కేవలం 25 శాతం మాత్రమే పూర్తిస్థాయిలో కొనసాగుతారు. మిగిలిన వారు నాలుగేళ్లకే వెనుదిరగాల్సి ఉంటుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. దీని వల్ల యువత ఓట్లు ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విపక్షాలకు మళ్లాయి .

ఇండియా కూటమి ఉచిత హామీలు
మరోవైపు దేశంలో పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇండియా కూటమి పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలు వారిని ఎక్కువగా ఆకర్షించాయి. పేదల కోసం ఎన్​డీఏ ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది, వారికి రేషన్‌ అందుతోందా లేదా అన్న అంశంపై స్థానికంగా ఉండే బీజేపీ, మిత్రపక్షాల కార్యకర్తలు దృష్టిపెట్టాల్సి ఉంది. వందేభారత్‌ తదితర సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఇది కూడా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.

సీనియర్ నేతల ప్రభావం
జీఎస్​టీ పన్ను విధానం గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడం వల్ల వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. మరోవైపు బీజేపీలో పెద్దనేతలు అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ తదితరులను బీజేపీ నాయకత్వం 75 ఏళ్ల నిబంధనతో పూర్తిగా పక్కనబెట్టింది. పార్టీ శ్రేణుల్లో అధికులు ఈ అంశాన్ని జీర్ణించుకోలేక నిర్లిప్తంగా ఉండిపోయారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు.

కూటమిని చులకన చేయడం
ఇండియా కూటమిని తక్కువగా అంచనా వేయడం కూడా బీజేపీకు మైనస్‌గా మారింది. మోదీ, అమిత్‌షా కాంగ్రెస్‌నీ, రాహుల్‌నీ చులకన చేస్తూ తమ స్థాయికి తగ్గి పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోనే ఆ కూటమి పోటీలో లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో కూటమి చేసే విమర్శలను పట్టించుకోలేదు. అవి నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి. సహజంగా ఐదేళ్లు పాలనలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వం పై విసుగు వస్తుంది. విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తాయి. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే పదేళ్లు పూర్తి చేసింది. దీంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇదే ప్రస్తుత ఎన్నికల్లో వ్యక్తమైంది.

సోషల్​ మీడియా ప్రచారమే
తమిళనాడులో అన్నామలై సునామీ సృష్టిస్తారని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఫలితాలు వచ్చేసరికి అది కేవలం బుడగేనని స్పష్టమైంది. సుదీర్ఘకాలంగా ద్రవిడ రాజకీయాలు ఉత్తరాది రాజకీయపక్షాలకు దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం సైతం అదే స్పష్టమైంది. అందుకనే నేతలు, కార్యకర్తలు సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మకుండా క్షేత్రస్థాయిలో సమీక్షించగలగాలి.

నేతలను పక్కన పెట్టడమే
గత డిసెంబరులో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతర సీఎంలను బీజేపీ నాయకత్వం మార్చింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మార్చి మోహన్‌ యాదవ్‌ను సీఎంగా చేసింది. రాజస్థాన్‌లో వసుంధరా రాజేను కాదని భజన్‌లాల్‌ శర్మను, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ స్థానంలో విష్ణుదేవ్‌ను సీఎంలుగా నియమించింది. ఈ మార్పును అక్కడి నేతలు, కార్యకర్తలు ప్రశ్నించలేదు. సుదీర్ఘకాలం తమకు సేవలందించిన నేతలను ఒక్కసారిగా కిందకు దించడంపై రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ప్రతికూల ప్రభావం పడింది.

NDAను సేవ్ చేసిన సౌత్! ఏపీదే కీ రోల్​- మరోసారి ఆదుకున్న కంచుకోటలు - Lok Sabha Election Result 2024

హరియాణాలో జాట్​లే కీలకం- ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తే వారిదే అధికారం! - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details