Pratidwani Debate on Why Woman Vote jagan:జగన్ సీఎం అయ్యక మద్యనిషేధం మరిచిపోయారు. అంగన్‌వాడీలను అణిచేశారు. ధరలు పెంచి దరువేశారు. అమరావతి మహిళలను అవమానించారు. మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపారు. వేలమంది యువతుల అదృశ్యంపై మౌనముద్ర దాల్చారు. భర్తలు తాగుడికి, బిడ్డలు గంజాయికి బానిసలుగా మారుతుంటే రోదిస్తున్న మహిళలకు విషాదాన్ని మిగిల్చారు. ఇళ్లు ఇస్తానని చెప్పి ఈసురోమనిపించారు. అయినా సరే అక్కచెల్లెమ్మలు మళ్లీ తనకే ఓటేయాలని జగన్ అంటున్నారు. సొంత చెళ్లెల్లే నమ్మని ముఖ్యమంత్రి జగన్‌ను రాష్ట్రంలోని మహిళలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిద్ధం అంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను నమ్మి మరోసారి ఓటు వేయటానికి మహిళలు సిద్ధంగా లేరు అనే చెప్పుకోవచ్చు. జగన్‌కు ఓటు ఎందుకు వేయలని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాకే ఓట్లు అడుగుతాం అని చెప్పారు. కానీ చౌక మద్యాన్ని అమ్ముతున్నారు. ఆ డబ్బు లెక్కల్లోకి రాకుండా కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. మహిళలపై నేరాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదికలు వచ్చాయి. మహిళల అదృశ్యంపై చాలా ఆందోళన నెలకొంది. దీనిపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించే ప్రయత్నాలేమీ ప్రభుత్వం చేయట్లేదు.