Pratidwani: ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్న అంశాలు నీట్, నెట్. (National Eligibility Cum Entrance Test) దీనినే నీట్ అంటారు. అంటే దేశానికి వైద్యులను అందించటం కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తిలోకి ప్రవేశించే వారు తగిన పరిజ్ఞానం లేకుండా అడ్డదారిలో వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడదే జరిగింది. నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైంది. సుమారు పాతిక లక్షల మంది విద్యార్థుల కష్టం ప్రశ్నార్థకమైంది. అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి? లోటు పాట్లు ఎక్కడ ఉన్నాయి? దేశంలోని పరీక్షలు ఇలా నవ్వుల పాలైతే ఈ దేశాన్ని కాపాడేదెవరు? దీనికి పరిష్కారమే లేదా? ఈ అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతిధ్వని చర్చలో డాక్టర్ ఎల్. నరేంద్రనాథ్, నిమ్స్ మాజీ డైరెక్టర్ వైద్య విద్యరంగ నిపుణులు, ప్రొ. కొండా నాగేశ్వర్, ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యవృత్తిలోకి ఇలా తప్పుడు మార్గాల్లో ప్రవేశిస్తే ఆ వృత్తికే కళంకం కాదా? ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది వైద్యులపైన? నీట్ యూజీసీ నెట్ ఈ రెండు పరీక్షల ప్రశ్నపత్రాలూ లీకయ్యాయి. ఈ ఉదంతాలు జాతీయ స్థాయిలో మన దేశం పరువు తీశాయి. పరీక్షల నిర్వహణలో లోపం ఎక్కడ జరిగిందంటారు? వైద్య వృత్తిలోకి ప్రవేశించే వారి కోసం పెట్టిన నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? మార్చుకోవాల్సిన అంశాలు మీరేమైనా గుర్తించారా? గ్రేస్ మార్కుల విధానం, ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ తీవ్రస్థాయి విమర్శలను ఎదుర్కొంటోంది. అసలు ఎన్‌టీఏ నిర్మాణం ఎలా ఉంటుంది? అందులో ఎవరెవరు ఉంటారు? పరీక్షల నిర్వహణ విధానం ఎలా ఉంటుంది?