Pratidhwani on Middlemen Ruling Price Hike : జనాలు కొనాలంటే కొరివి. రైతులు అమ్మాలంటే అడవి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సరిగ్గా సరిపోతుందీ మాట. ప్రతి సంవత్సరం ప్రతి సీజన్‌లో ఇదే దుస్థితి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వివిధ కూరగాయలు మొదలు కందిపప్పు, మినపప్పు, బియ్యం వరకు ఇదే దుస్థితి. ఒక్కోసారి కిలో రూ.200లు పలికిన అదే టమాటాకు కిలో రూ.2 కూడా దక్కక రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితుల ఎందుకు? ఇక్కడ కనిపిస్తున్న కారణాలు ఒకటి దళారీ వ్యవస్థ. రెండు ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యాలు, గోదాముల కొరత.
ఏళ్లు గడుస్తున్నా రైతులు, ప్రజల కష్టం కళ్లకు కడుతున్నా వీటిల్లో ఎందుకు మార్పు రావడం లేదు? వ్యవసాయోత్పత్తుల ధరలపై సరైన నియంత్రణ ఎక్కడ? ఎలాగో పెట్టుబడి సమకూర్చుకుని అనేకవిధాల శ్రమకోర్చి కూరగాయలను సాగుచేస్తున్న అన్నదాతలకు దక్కుతున్నదేంటి? కూరగాయలు, పండ్లకోసం జనం ధారపోస్తున్న డబ్బులో మూడో వంతు మాత్రమే కర్షకుల వరకు చేరుతున్న పరిస్థితి ఉంది. మిగిలిన సొమ్మంతా ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రీటైలర్ల వాటాలుగా ఉన్నాయి. అవి కూడా ఛార్జీలకే చెల్లిపోతున్నట్లు ఆర్‌బీఐ నిపుణుల నివేదికలో వెల్లడైంది.
మరి ప్రజలకు అవసరమయ్యే చాలా వ్యవసాయ ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరల జాబితాలో పెట్టిన ప్రభుత్వాలు కూరగాయలు, పండ్లు వంటి వాటిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రతిప్రాంతంలో అవసరాలకు తగిన స్థాయిలో కూరగాయలు అందుబాటు ధరల్లో లభించాలి అన్నా అదే రీతిలో రైతులకు గిట్టుబాటు కావాలన్నా ఏం చేయాలి? వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలు కల్పించడంలో గోదాముల పాత్ర ఏమిటి? ఈ విషయంలో రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిస్థితులు ఎలా ఉన్నాయి?