తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తారా?

NDA Target 40 Seats Bihar : లోక్​సభ ఎన్నికల ముందు బిహార్​లో మళ్లీ ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా మరోసారి జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బిహార్​లోని 40 లోక్​సభ సీట్లను కైవసం చేసుకోవడమే తమ టార్గెట్​ అని ఎన్​డీఏ చెబుతోంది. మరి జేడీయూ చేరికతో NDAకు ఎంత లాభం? 40 సీట్లు సాధించేందుకు ఎలా ఉపయోగపడుతుంది?

BJP Target In Bihar
BJP Target In Bihar

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 9:49 PM IST

NDA Target 40 Seats Bihar : ల‌క్ష్యం పెద్ద‌దిగా ఉన్న‌ప్పుడు దానిని ఛేదించే వ్యూహాలు కూడా సుదీర్ఘంగానే ఉంటాయి. ఇప్పుడు ఇదే సుదీర్ఘ ల‌క్ష్యాల‌తో కేంద్రంలోని భారతీయ జ‌న‌తా పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే రెండు సార్లు కేంద్రంలో అధికారం ద‌క్కించుకున్న బీజేపీ, త్వరలో జరగనున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు ముమ్మ‌రం చేసింది. ఒక్క విజ‌య‌మే కాదు ఏకంగా 400 పైచిలుకు పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అయితే ఈ ల‌క్ష్య ఛేద‌న‌కు సంబంధించి చేయాల్సినవ‌న్నీ పూర్తి చేసుకున్న కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం, 2029లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభించేసింది. మొత్తంగా 2014, 2019 ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాల‌తో సంతృప్తి చెంద‌కుండా ప్ర‌స్తుత ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌తో పాటు 2029లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు కూడా ప‌క్కా ప్లాన్‌ను రెడీ చేసుకుని రంగంలోకి దిగింది. అందులో భాగంగా 40 లోక్‌సభ సీట్లు ఉన్న బిహార్​పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తమను గద్దె దించాలని నిర్ణయించుకుని ఏర్పడిన విపక్షాల కూటమికి గట్టి షాక్ ఇచ్చి జేడీయూతో కలిసి మళ్లీ బిహార్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

మహాగఠ్​బంధన్​తో కలిసి ఏడాదిన్నర క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ తిరిగి ఎన్​డీఏ గూటికి చేరిపోయారు. బీజేపీతో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్​డీఏలో జేడీయూ చేరిక ఇరుపార్టీలకు లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బిహార్​లో గతసారి 39 లోక్​సభ స్థానాలను కైవసం చేసుకున్న ఎన్​డీఏ, ఈసారి 40 స్థానాలను టార్గెట్​గా పెట్టుకుంది.

"నీతీశ్​తో బీజేపీ పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుంది. లోక్​సభ ఎన్నికల్లో బిహార్​లో ఎన్​డీఏ క్లీన్ స్వీప్ చేస్తుంది. మొత్తం 40 సీట్లు గెలుచుకుంటాం. రాష్ట్రాన్ని కొత్త ప్రభుత్వం ఉజ్వల్ బిహార్​గా మార్చుతుంది. ఎన్​డీఏ అధికారంలో ఉన్నప్పుడే బిహార్​ ప్రజలు అభివృద్ధి పరంగా లాభపడ్డారు."

- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

2020 జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ 125 సీట్లను గెలుచుకుంది. మహాగఠ్​బంధన్​ 110 సీట్లు గెలుచుకోగా ఇతరులు 8స్థానాలను కైవసం చేసుకున్నారు. నీతీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్​డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అంతకుముందు లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి 39 సీట్లు గెలుచుకోగా మహాగఠ్ బంధన్​ ఒకే ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి మరోసారి లోక్​సభ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకుంది.

"మేం బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం. 2020 ఎన్నికల్లో మేమే గెలిచాం. అప్పుడు లాలూ యాదవ్ కుటుంబాన్ని ఓడించాం. ఇక భవిష్యత్తులో కూడా అదే చేస్తాం"

- సామ్రాట్ చౌదరి, బిహార్ డిప్యూటీ సీఎం

ఇక రాష్ట్రంలోని మిత్రపక్షాల సహకారంతో కచ్చితంగా 40 లోక్​సభ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది ఎన్​డీఏ. జేడీయూ నీతీశ్​ కుమార్​ కూర్మి వర్గం పెద్ద ఎత్తున ఎన్​డీఏకు బలంగా నిలవనుంది. సంఖ్యాపరంగా వారు తక్కువే అయినా కొన్ని ప్రాంతాల్లో వారి ప్రభావం ఎక్కువగానే ఉంది. అధికార కూటమి వెంటే వారంతా నడిచే అవకాశం ఉంది. ఆర్​ఎల్​జేడీ ఉపేంద్ర కుశ్వాహ వర్గంతోపాటు ఎల్​జేపీ చిరాగ్ పాస్​వాన్​, హెచ్‌ఏఎం సంతోశ్ కుమార్ సుమన్ దళిత వర్గాలు కూడా ఎన్​డీఏ- జేడీయూ కూటమికే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు, ఇటీవలే బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ శతజయంతి వేళ ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. 1970, 80ల్లో దేశ సామాజిక రాజకీయాలపై ఎంబీసీ నేతగా ఠాకూర్‌ వేసిన ముద్ర బిహార్‌ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. ఇప్పుడు ఆయన వర్గానికి చెందిన వారితోపాటు అభిమానులు కూడా ఎన్​డీఏకు జై కొట్టే అవకాశం ఉంది. అలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 40 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఎన్​డీఏ ధీమాగా చెబుతోంది.

ఆరోసారి బీజేపీతో దోస్తీకి సై- మిత్రపార్టీలకు నీతీశ్​ మొండిచేయి!

బీజేపీ బిగ్ రివెంజ్- ఏడాదిన్నరలో మళ్లీ బిహార్ పీఠం కైవసం- ఫుల్ జోష్​తో లోక్​సభ ఎన్నికలకు!

ABOUT THE AUTHOR

...view details