- బరిలోకి దిగిన వారసులు
- నేతల భావోద్వేగ ప్రసంగాలు
- గెలుపు తలుపు తట్టేందుకు వ్యూహాలు
- తమ ప్రభావం, ప్రాభవం తగ్గలేదని నిరూపించుకునేందుకు సీనియర్ల ప్రణాళికలు
ఇవన్నీ కలిసి ఉత్తర కర్ణాటకలో రాజకీయ వేడి పతాకస్థాయికి చేరింది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో ఏప్రిల్ 26న దక్షిణ కన్నడ ప్రాంతంలోని 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మూడో విడతలో ఉత్తర కర్ణాటకలోని మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తర కర్ణాటకలో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు సీనియర్ నేతలు, మంత్రుల వారసులు ఉండడం వల్ల ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.
Lok Sabha Polls Uttar Kannada Politics :చక్రం తిప్పగలిగే స్థాయిలో ఉన్న నేతలను చూసి ఆయా పార్టీల అధిష్ఠానాలు వారి వారసులకు టికెట్లు కేటాయించాయి. జాతీయ పార్టీల్లో సీనియర్లు, మంత్రులు గెలుపు హామీలిచ్చిన తర్వాతే వారి వారసులకు అధిష్టానాలు టికెట్లను కేటాయించాయి. ఈ హామీతో వారసులు గెలిచినా ఓడినా పూర్తి బాధ్యత వారి ఇంటి పెద్దలదే కానుంది. దీంతో ఉత్తర కర్ణాటకలో లోక్‌సభ పోరు సీనియర్లకు మంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
కాంగ్రెస్ ముందంజ!
ఉత్తర కర్ణాటకలోని మొత్తం 14 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన మొత్తం 28 మంది ప్రధాన అభ్యర్థుల్లో 10 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే ఉన్నారు. వీరిలో కేవలం ఇద్దరికే ఇంతకుముందు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. మిగిలిన 8 మంది కనీసం స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం కూడా లేదు. అగ్రనేతల వారసులు, బంధువులను బరిలోకి దింపిన పార్టీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఈ విడతలో బీజేపీ కేవలం ఇద్దరు వారసులనే బరిలో దింపగా కాంగ్రెస్ 8 మందిని పోటీకి నిలిపింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పెద్దలకే తమ వారసులను గెలిపించే బాధ్యత ఎక్కువగా ఉంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు సీనియర్ల భవిష్యత్తుకు ప్రతిష్ఠకు సవాలుగా మారాయి.
ఖర్గేకు చాలా ముఖ్యం
ఉత్తర కర్ణాటకలో గెలుపు అనివార్యమైన వారిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఖర్గే వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచిన కలబురగి నియోజకవర్గంలో 2019లో తన రాజకీయ జీవితంలోనే తొలి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. తనకున్న ఏఐసీసీ బాధ్యతలు, రాజ్యసభ సభ్యత్వం కారణంగా కలబురగి నియోజవర్గం నుంచి మళ్లీ పోటీ చేయలేక అల్లుడు రాధాకృష్ణ దొడ్డమనిని ఖర్గే ఎన్నికల బరిలో దింపారు. ఇటీవల ఖర్గేలో కలబురగిలో ప్రచారం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
అల్లుడి కోసం పోరాటం!
తన అల్లుడిని గెలిపించకపోతే తనకు ఈ చోట స్థానం లేనట్లే అని, మీ హృదయాల్లో తనకు చోటు లేదని, కనీసం తన అంతిమ సంస్కారానికైనా రావాలని ఖర్గే ఓటర్లను అభ్యర్థించారు. ఖర్గే లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఇలా భావోద్వేగానికి గురయ్యారంటే ఖర్గేకు అల్లుడి గెలుపు ఎంత కీలకమో అర్థమవుతోంది. తన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సాయంతో తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ఖర్గే ప్రయత్నం చేస్తున్నారు. తన రాజకీయ మార్గదర్శకత్వంలోనే ఎదిగి, ప్రత్యర్థిగా మారి, బీజేపీ అభ్యర్థిగా మారిన ఉమేశ్ జాదవ్ ఇక్కడ పోటీ పడుతుండటం ఖర్గేకు కంటగింపుగా మారింది. 2019 ఎన్నికల్లో జాదవ్ చేతిలోనే ఖర్గే ఓటమి పాలయ్యారు.