Key Candidates In 5th phase Election: ఐదోదశ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూశ్ గోయల్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ బరిలో దిగగా, లఖ్‌నవూ స్థానంలో రాజ్‌నాథ్ సింగ్, అమేఠీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. కాగా, మే 20న దేశవ్యాప్తంగా ఉన్న 49 స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనుంది.
రాయ్‌బరేలీలో హోరాహోరీ తప్పదా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. 2019 వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి దినేశ్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయన కూడా బలమైన నేత. ఈ నేపథ్యంలో రాహుల్‌కు రాయ్‌బరేలీలో విజయం నల్లేరు మీద నడక కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్‌కు దినేశ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, కేరళలోని వయనాడ్‌లో పోటీ చేసిన రాహుల్‌కు రాయ్‌బరేలీలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. దశాబ్దాలుగా హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీలో రాహుల్ విజయంపై ఆసక్తి నెలకొంది. కాగా, రాహుల్ గాంధీ 2004-2019 వరకు అమేఠీ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
హ్యాట్రిక్‌పై రాజ్‌నాథ్ ధీమా
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశపడుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను నిలబెట్టింది. 2019లో ఆరు లక్షల పైగా మెజారిటీతో గెలిచిన రాజ్‌నాథ్ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు.
స్మృతి మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
2019లో అమేఠీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించిన బీజేపీ మహిళ నేత స్మృతి ఇరానీ మరోసారి అదే స్థానం నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ కిశోరీ లాల్‌ను స్మృతిపై పోటీకి దింపింది. ఈ నేపథ్యంలో అమేఠీలో పోరు ఆసక్తికరంగా మారింది.
అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పీయూశ్
ముంబయి నార్త్ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భూషణ్ పాటిల్‌ను బరిలో ఉంచింది. ముంబయి నార్త్ నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తానని పీయూశ్ గోయల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పీయూశ్, భూషణ్ పాటిల్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ముంబయి పేలుళ్ల కేసు న్యాయవాదికి టికెట్
ముంబయి నార్త్ సెంట్రల్ స్థానం నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను బీజేపీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ పోటీ చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్‌ను ఈసారి పక్కనపెట్టి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. 2008 ముంబయి దాడి కేసు సహా పలు ప్రముఖ కేసులను ఉజ్వల్ నికమ్ వాదించి మంచి పేరు సంపాదించుకున్నారు.