తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కాశ్మీరంలో రాజకీయ వేడి- దిగ్గజ నేతల నడుమ టైట్ ఫైట్! - jammu kashmir lok sabha elections

Jammu Kashmir Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికలతో జమ్మూకశ్మీర్‌‌లో రాజకీయ వేడి రాచుకుంది. ప్రత్యేకించి ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి, మరో మాజీ కేంద్ర మంత్రి పోటీ చేస్తున్న స్థానాల్లో ఎలాంటి ఫలితం వస్తుందోననే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దిగ్గజ నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై ఫోకస్

Jammu Kashmir Lok Sabha Elections 2024
Jammu Kashmir Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 8:47 PM IST

Jammu Kashmir Lok Sabha Elections 2024 :జమ్మూకశ్మీర్ రాజకీయం రసవత్తరంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదుగురు ప్రముఖులు పోటీ పడుతుండడం వల్ల ఆయా స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి, మరో మాజీ కేంద్ర మంత్రి ఈసారి ఎన్నికల బరిలోకి దిగడం వల్ల యావత్ దేశం దృష్టి కశ్మీర్ వైపునకు మళ్లింది. ఈ నేపథ్యంలో దిగ్గజ నేతలు పోటీ చేస్తున్న జమ్మూ, శ్రీనగర్‌, ఉధంపూర్, అనంత్‌నాగ్-రాజౌరీ, బారాముల్లా స్థానాల పరిస్థితులను ఓ సారి పరిశీలిద్దాం.

మెహబూబా ముఫ్తీ వర్సెస్ గులాం నబీ ఆజాద్
అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఇద్దరు దిగ్గజ నేతలు తలపడుతున్నారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ కాంగ్రెస్ నేత, డీపీఏపీ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ట్రాక్ రికార్డు మెహబూబా ముఫ్తీకి ప్లస్ పాయింట్. కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో భారత సైన్యంపై ఉగ్ర దాడి జరిగిన వెంటనే నిర్వహించిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో మెహబూబాకు భారీ షాక్ తగిలింది. ఆమె మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ పోల్స్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి హస్నయిన్ మసూదీ విజయఢంకా మోగించగా, కాంగ్రెస్ అభ్యర్థి గులాం అహ్మద్ మిర్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లోనూ ఇక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి నుంచి మెహబూబా ముఫ్తీ, గులాం నబీ ఆజాద్‌లకు గట్టిపోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. గులాం నబీ ఆజాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇది రెండోసారి. ఇంతకుముందు 2014లో ఆయన ఉధంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు.

ఒమర్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గతంలో చాలాసార్లు శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. ఈసారి ఆయన గతానికి పూర్తి విభిన్నంగా బారాముల్లా సీటు నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. కేంద్ర మంత్రిగానూ ఆయన గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. బారాముల్లా స్థానంలో ఆయన ప్రత్యర్ధులుగా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజాద్ లోన్, అవామీ ఇత్తెహాద్ పార్టీ నేత అబ్దుల్ రషీద్ షేక్ ఉన్నారు. ఈ ఇద్దరు నేతలకు కూడా బలమైన రాజకీయ పునాది ఉంది. 2019 ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి మహ్మద్ అక్బర్ లోన్ గెలిచారు. మొదటి రన్నరప్‌గా రాజా ఐజాజ్ అలీ (జేకేపీసీ), రెండో రన్నరప్‌గా ఇంజనీర్ రషీద్ (ఏఐపీ) నిలిచారు.

కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్
కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత జితేంద్ర సింగ్ గత తొమ్మిదేళ్లుగా కశ్మీర్‌లోని ఉధంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో జితేంద్ర సింగ్ ఉన్నారు. ఉధంపూర్ స్థానం నుంచి ఆయన ప్రత్యర్ధులుగా ఉన్నవారిలో కాంగ్రెస్‌ నేత చౌదరి లాల్ సింగ్, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ నేత జీఎం సరూరి ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఉధంపూర్ నుంచి జితేంద్ర సింగ్‌కు 61.4 శాతం ఓట్లు వచ్చాయి. మొదటి రన్నరప్‌గా విక్రమాదిత్య సింగ్ (కాంగ్రెస్), రెండో రన్నరప్‌గా హర్ష్ దేవ్ సింగ్ (జేకే ఎన్పీపీ) నిలిచారు.

ఆరోగ్య కారణాలతో ముగ్గురు నేతలు ఔట్
కశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ స్థానంలో గత ఎన్నికల్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గెలిచారు. అప్పట్లో ఆయనకు 57.1 శాతం ఓట్లు వచ్చాయి. ఆరోగ్య కారణాల వల్ల డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఈసారి పోటీ చేయడంలేదు. ఆరోగ్య కారణాలతో ఈసారి మహ్మద్ అక్బర్ లోన్ (సిట్టింగ్ ఎంపీ బారాముల్లా), హస్నైన్ మసూది (సిట్టింగ్ ఎంపీ అనంతనాగ్) పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అనంత్‌నాగ్‌ నుంచి మియాన్ అల్తాఫ్, శ్రీనగర్‌ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ, బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లాకు టికెట్ మంజూరు చేసింది. గత ఎన్నికల్లో జమ్మూ స్థానం నుంచి జుగల్ కిషోర్ శర్మ (బీజేపీ) 58.0 శాతం ఓట్లతో గెలిచారు. మొదటి రన్నరప్‌గా రామన్ భల్లా (కాంగ్రెస్) నిలిచారు. ఇక లద్ధాఖ్‌లో గత ఎన్నికల్లో జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ (బీజేపీ) 33.9 శాతం ఓట్లతో గెలిచారు. మొదటి రన్నరప్‌గా సజ్జాద్ హుస్సేన్ కార్గిలీ నిలిచారు. ఆయనకు 25.3 శాతం ఓట్లు వచ్చాయి.

తమిళనాడులో బీజేపీ జోరు- అన్నామలై రాకతో మారిన సీన్​ - bjp growth in tamil nadu

కేంద్ర పాలిత ప్రాంతాల్లో సత్తా చాటేదెవరో? బీజేపీకి సర్వేలన్నీ జై- కాంగ్రెస్​కు గడ్డు పరిస్థితులు! - Union Territories Of India

ABOUT THE AUTHOR

...view details