Pratidwani :దశాబ్దాలుగా ఆరని అరబ్ - ఇజ్రాయేల్ మధ్య యుద్ధం. మరింత నిప్పులు కుంపటిగా మారుతోంది. ఉన్నట్లుండి హెజ్‌బొల్లాపై నిర్థాక్షిణ్యంగా విరుచుకు పడుతున్న ఇజ్రాయేల్‌పై చేయి సాధించినట్లు కనిపించినా ఆ వెనక పొంచి ఉన్న సవాళ్లు అంతర్జాతీయ సమాజాన్ని కలవర పెడుతున్నాయి. లెబనాన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కరోజే ఇజ్రాయేల్ దాడుల్లో అక్కడ 492 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇజ్రాయేల్ - పాలస్తీనా మధ్య మొదలైన ఈ యుద్ధం ఇంతగా ఎందుకు విస్తరిస్తోంది? ఆ నిప్పురవ్వలు ఇరాన్ నుంచి లెబనాన్ వరకు ఎందుకు మంటలు పుట్టిస్తున్నాయి? ఇది ఇప్పట్లో ఆగుతుందా? మరింతగా రాజుకుంటుందా? ఇంటా బయటా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నెతన్యాహు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? దీని ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చల్లో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డా. కన్నెగంటి రమేశ్, ఐక్యరాజ్య సమితి మాజీ భద్రతా సలహాదారుడు, విశ్రాంత ఐపీఎస్ కేసీ రెడ్డి పాల్గొన్నారు.
ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలు వణికిపోయాయి. వేల మంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాల్లో బీరుట్‌వైపు పారిపోవడం ప్రారంభించారు. దాంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయి, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. హెజ్‌బొల్లాకు చెందిన దాదాపు 1300 లక్ష్యాలను ఢీకొట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్‌బొల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. 2006లో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన రెండు సైనిక స్థావరాలపై తాము 125 రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది.