తెలంగాణ

telangana

ETV Bharat / opinion

తమిళనాడులో బీజేపీ జోరు- అన్నామలై రాకతో మారిన సీన్​ - bjp growth in tamil nadu - BJP GROWTH IN TAMIL NADU

BJP Growth In Tamil Nadu : లోక్‌సభ ఎన్నికల్లో 370కి పైగా సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ప్రతి సీటును అత్యంత కీలకంగా భావిస్తోంది. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో ఈ సారి ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది. గతంలో తమిళనాడులోని ప్రధాన పార్టీలతో పొత్తులతో మాత్రమే బరిలోకి దిగిన బీజేపీ, ఈసారి 19 చోట్ల సొంతంగా పోటీ చేస్తోంది. మాజీ IPS అధికారి అన్నామలై తమిళనాడులో బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ దూసుకెళ్తోంది. అన్నామలై చేపట్టిన "ఎన్‌ మన్‌", "ఎన్ మక్కల్ " పాదయాత్ర తర్వాత బీజేపీకి క్రమంగా ఆదరణ పెరుగుతోంది.

BJP Growth In Tamil Nadu :
BJP Growth In Tamil Nadu :

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 4:45 PM IST

BJP Growth In Tamil Nadu :సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, తమ ప్రభావం తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో ఇప్పటివరకు ప్రధాన పార్టీలతో కూటమిగా బరిలోకి దిగిన కమలం పార్టీ, ఈ సారి చిన్నపార్టీలతో జట్టుకట్టింది. ఒంటరిగా 19 చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీ అనూహ్యంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో పెరిగిన ఆదరణే కారణమని తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ పగ్గాలను మాజీ IPS అధికారి అన్నామలై చేపట్టిన తర్వాత ఆ పార్టీలో జోష్ పెరిగింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభ ఎన్నికలైనా ప్రాంతీయ పార్టీలైన DMK, అన్నాడీఎంకేలదే హవా కొనసాగింది. ద్రవిడనాట మరో పార్టీకి ఆ తరహాలో ఏ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు పట్టం కట్టలేదు. అయితే గతంలో అట్టడుగునున్న బీజేపీ తాజాగా పుంజుకుంటోంది. తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై దూకుడైన మాటతీరు, ధృడనిశ్చయంతో ముందుకు సాగుతున్న విధానం అక్కడి ప్రజల్ని ఆకట్టుకుంటోంది.

అన్నామలై పాదయాత్రే కారణం
తమిళనాడులో బీజేపీ ఆత్మ విశ్వాసం పెరగడానికి "ఎన్‌ మన్‌, ఎన్‌ మక్కల్ " నా భూమి, నా ప్రజలు అనే నినాదంతో అన్నామలై చేపట్టిన పాదయాత్రే కారణమని తెలుస్తోంది. దాదాపు 7 నెలల పాటు సాగిన ఆ యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. యాత్ర సాగినన్ని రోజులు అధిక సంఖ్యలో ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారు. ఈ ఆదరణను బీజేపీ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంత వరకు ఓట్లుగా మలుచుకుంటుదనేది ఆసక్తిగా మారింది. పాదయాత్ర సమయంలో తమిళనాడులోని కుటుంబ రాజకీయాలు, అవినీతి పాలనను ప్రస్తావిస్తూ అన్నామలై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అధికార DMKను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత డీఎంకే ఫైల్స్ పేరుతో ఆరోపణలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వీటితో పాటు అనేక ప్రజా సమస్యలపై అధికార DMK పై ఆయన ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలనే అన్నామలై నినాదం ప్రజల్ని ఆకర్షించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యువతలో పెరిగిన మద్దతు
తమిళనాడులో ఒకరి తర్వాత ఒకరు అధికారం చేపడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు లేదు. ముఖ్యంగా మైనారిటీలు, జాలర్లు, మహిళలు ఇంకా కొన్ని వర్గాల్లో కమలంపార్టీకి ఆదరణ తక్కువ. అందుకే ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు అన్నామలై, అవినీతి, కుటుంబపాలన అంశాలను లేవనెత్తుతున్నారని తెలుస్తోంది. అన్నామలై పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ చాలా వరకు విస్తరించిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు M. చక్రవర్తి అన్నారు. అన్ని వర్గాలు ముఖ్యంగా యువతలో తమ పార్టీకి మద్దతు పెరుగుతోందని చెప్పారు. గత బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్ చేపట్టిన "వెల్ యాత్ర" కన్నా అన్నామలై చేసిన ఎన్‌ మన్ , ఎన్ మక్కల్ పాదయాత్ర బీజేపీ స్టాక్‌ను మరింత పైకి తెచ్చిందని పేర్కొన్నారు.

మోదీ ర్యాలీకి వచ్చిన జనమే నిదర్శనం
గతంతో పోలిస్తే తమిళనాడులో బీజేపీకి ప్రజల మద్దతు భారీ స్థాయిలో పెరిగిందని మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు, కర్ణాటక బీజేపీ జాతీయ కో-ఇన్‌చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయంలో ప్రధాని మోదీ చేపట్టిన ర్యాలీకి వచ్చిన ప్రజలే అందుకు నిదర్శనమన్నారు. అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా బరిలోకి దిగడంపై స్పందించిన ఆయన, కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

తమిళనాడులో బీజేపీ 19 స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తోంది. ఆ పార్టీ మిత్ర పక్షాలు 4 చోట్ల కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి. ఇక ఎన్‌ మన్ ఎన్ మక్కల్ పాదయాత్రతో మంచి పేరు సంపాదించిన అన్నామలై, కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. కోయంబత్తూరులో DMK, అన్నాడీఎంకే, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉండనుంది.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. 2014లో బీజేపీ, ఆ పార్టీ మిత్ర పక్షం PMK కేవలం చెరో సీటు మాత్రమే గెలుచుకున్నాయి. మరోవైపు అప్పటి సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 37 చోట్ల విజయభేరి మోగించింది. 2019లో గతంలో గెలిచిన కన్యాకుమారి సీటును బీజేపీ కాపాడుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూడా ఘోరంగా విఫలమైంది. కేవలం థేని సీటును మాత్రమే గెలుచుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 24 చోట్ల DMK విజయం సాధించింది. ఆ పార్టీ మిత్ర పక్షాలు 14 స్థానాల్లో గెలుపొందాయి. 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 19న అన్ని స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తమిళనాడులో బీజేపీ రెండంకెల ఓట్ల శాతం సాధిస్తుందని ముందస్తు సర్వేలు అంచనా వేశాయి.

తమిళనాడుపై BJP స్పెషల్​ ఫోకస్- అన్నామలై​ మ్యాజిక్​ పనిచేస్తుందా? డబుల్​ డిజిట్ సాధ్యమేనా? - Tamil Nadu BJP Chief K Annamalai

విరుధ్​నగర్​లో సినీ 'సైరన్​'- సిట్టింగ్​ MPపై రాధిక, విజయ్​కాంత్​ తనయుడి పోటీ- తమిళనాట ఉత్కంఠ పోరు! - VIRUDHNAGAR LS ELECTIONS 2024 TN

ABOUT THE AUTHOR

...view details