ANDHRA PRADESH PEOPLE FAVOUR TO NDA: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. అయితే, అదేదో నేరమైనట్లు లోగడ ఎవరూ పొత్తు పెట్టుకోనట్లు అధికార వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పొత్తును రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. ఆ మాటకొస్తే 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్), కమ్యూనిస్టులతో జట్టుకట్టింది. వైఎస్సార్సీపీ సైతం 2014లో తెలంగాణలో సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన బీజేపీ ఎన్‌డీఏ కూటమిని బలోపేతం చేసింది.
అత్యధిక ఓటర్లు కూటమి వైపే:టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టడంవల్ల ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీకి ఒక్క సీటైనా రాదని జోరుగా పందేలు కాస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పొత్తు ప్రభావం బలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాయలసీమలోనూ కూటమి మంచి ఫలితాలే సాధిస్తుందని సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి జట్టుకట్టగా జనసేన మద్దతిచ్చింది. అప్పుడు టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా 47 శాతానికి పైగా ఓట్లు సాధించాయి.
వైఎస్సార్సీపీ 44 శాతం ఓట్లకే పరిమితమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన టీడీపీకి 39.17 శాతం, జనసేనకు 5.53 శాతం, బీజేపీకి 0.85శాతం ఓట్లు పోలయ్యాయి. 49.95 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టింది. ప్రముఖ సంస్థలు ఏపీలో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే- గతంలో కంటే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజల్లో ఉన్న విశేష అభిమానం కూటమికి కలిసివచ్చే అంశం.
మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల దూకుడు - ఎప్పుడు కలిసినా విజయ కేతనమే - TDP Janasena Bjp Friendship in AP
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పట్టభద్రుల స్థానాలనూ టీడీపీనే గెలుచుకుంది. 2019లో వచ్చిన ఓట్లతో పోలిస్తే 2023 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్రలో 4.27శాతం, తూర్పు రాయలసీమలో 5.28శాతం, పశ్చిమ రాయలసీమలో 3.78శాతం చొప్పున ఓట్లను పెంచుకుంది. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్రలో 18.89శాతం, తూర్పు రాయలసీమలో 19.10శాతం, పశ్చిమ రాయలసీమలో 13.37శాతం మేర ఓట్లు కోల్పోయింది. ఓటమిపై ఆత్మపరిశోధన చేసుకోకుండా పట్టభద్రులు తమ ఓటర్లు కాదని వైఎస్సార్సీపీ నిర్లజ్జగా ప్రకటించింది. వాలంటీర్ల సాయంతో మళ్లీ అధికారంలోకి రావచ్చునన్నది ఆ పార్టీ భావన.
కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వాలంటీర్ల ప్రభావం నామమాత్రమేనని స్పష్టమైంది. ముఖ్యమంత్రి బటన్ నొక్కుళ్లు వైఎస్సార్సీపీను గెలిపిస్తాయనుకోవడం అత్యాశే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రజలు పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యుత్, బస్సు ఛార్జీలు, పన్నుల మోతను తలచుకుని- ‘జగన్ ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటోంది’ అని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. రోడ్ల దుస్థితిపై జనం ఆగ్రహంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మడంలేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు మరింతగా మెరుగవుతాయనే భావన బలపడటమే దీనికి కారణం.
టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తే కొన్ని బీసీ కులాలు ఈ కూటమికి ఓటు వేయవని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవంలో చూస్తే, 2014లో జనసేన మద్దతిచ్చినప్పుడు బీసీ ఓట్లలో 54 శాతం టీడీపీకే లభించాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో కుల సమీకరణాలు తిరిగి 2014లాగా మారి కూటమికి అనుకూలించే ఆస్కారముంది. 2019 ఎన్నికల్లో జగన్ వెంట నిలిచిన అనేకమంది ప్రస్తుతం వైఎస్సార్సీపీ వైపు నిలబడేందుకు అంత సిద్ధంగా లేరు. రకరకాల కారణాలవల్ల పాలకపక్షంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. జగన్ సీఎం కావడానికి విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇప్పుడు ఆయనకు దూరమయ్యారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ప్రతిరోజూ జగన్‌ను ఘాటుగా విమర్శిస్తున్నారు.
'పాంచ్ పటాకా' కూటమి ధమాకా! - వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకతకు ఐదు కారణాలివే - Who will win in AP
వైఎస్సార్సీపీకి దూరం:గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి కృషిచేసిన నాయకులు, కార్యకర్తల్లో ఇప్పుడు అటువంటి కసి, పట్టుదల కనిపించడంలేదు. 2019లో వైఎస్సార్సీపీకి మద్దతిచ్చిన సామాజికవర్గాలు ఇప్పుడు దూరమవుతుంటే- నాడు టీడీపీకి దూరమైన సమూహాలు, రైతులు తిరిగి ఆ పార్టీకి చేరువవుతున్నారు. కూటమి పక్షాలకు లోగడ లభించిన ఓట్ల శాతాలను పరిశీలించినా ఈసారి వారి విజయం నల్లేరు మీద నడకేనని అర్థమవుతుంది. కిందటి సారి ఓటేసిన వారిలో ఎవరూ ఈసారి వైఎస్సార్సీపీకి వేస్తామని అనడం లేదు. కానీ, గతంలో వైఎస్సార్సీపీకి ఓటేశామని అంగీకరిస్తూనే, ఈసారి మాత్రం ఆ పార్టీకి వేయబోమని చెబుతున్నవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇన్ని సానుకూలతల నడుమ, రేపటి ఎన్నికల్లో విజయం నిస్సందేహంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే!
విశేష ప్రజాస్పందన:గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతిచ్చిన వివిధ సామాజి కవర్గాలు, సమూహాలు ఇప్పుడా పార్టీకి దూరమైనట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. కూటమి గెలుపు తథ్యమని క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్ద్వంద్వంగా చాటుతున్నాయి. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడుతూనే రాష్ట్రాభివృద్ధికి తమ ప్రణాళికలేమిటో విస్పష్టంగా తెలియజెబుతున్నారు. ప్రచార కార్యక్రమాలకు వస్తున్న స్పందనను చూస్తే అత్యధిక ఓటర్లు కూటమివైపే మొగ్గుచూపుతున్నారని అర్థమవుతోంది. ఆ స్పందన త్వరలోనే ప్రజల నుంచి ఓట్ల రూపంలో ప్రస్ఫుటం కానుంది.
జగన్‌పై యువత ఆగ్రహం:గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 45.55 శాతం, టీడీపీకి 27.32 శాతం ఓట్లు పోలయ్యాయి. ‘ఒపీనియన్ మేకర్స్’గా పిలిచే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వైఎస్సార్సీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్ రద్దు హామీని జగన్ మోహన్ రెడ్డి విస్మరించడం, సమయానికి జీతాలు రాకపోవడం, ఇతర ప్రయోజనాలు అందకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వారు కనబరచిన ఉత్సాహంతో వారి మనోభావాలు స్పష్టమయ్యాయి. జగన్ సర్కారు జాబ్ క్యాలెండర్‌ను సక్రమంగా వెలువరించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
- ఐవీ మురళీకృష్ణ శర్మ, (పరిశోధకులు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ)
సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న కూటమి మేనిఫెస్టో - ప్రజల్లో విశేష ఆదరణ - Positive Responce to nda manifesto