Girl in Unexpected Danger : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామానికి చెందిన మునిలక్షుమ్మ, మల్లికార్జున దంపతులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది. వీరికి మల్లేశ్వరి, అర్చన, కీర్తన ముగ్గురు ఆడపిల్లలు సంతానం. కష్టాలకనుగుణంగా ముగ్గురు పిల్లలను బడికి పంపించి బాగా చదివించాలనుకున్నారు. వారి ఆశలను ప్రమాద రూపంలో విధి ఆడియాశలు చేసింది. 11 ఏళ్ల వయసున్న కీర్తన కొన్ని నెలల క్రితం చదువుతూ బడి నుంచి ఇంటికొస్తుండగా ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో బాలిక గడ్డానికి రక్త గాయమైంది. ఓ ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. గాయమైన గడ్డానికి కుట్లు వేసి వైద్యం అందించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆ కొన్నిరోజుల తరువాత సమస్య వచ్చిపడింది.
గాయం నయమయ్యే కొద్ది గడ్డం కింద గడ్డ ఏర్పడి పెరుగుతూ వచ్చింది. గడ్డం కింద గడ్డ పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసుపత్రల బాటపట్టారు. ప్రొద్దుటూరు, కడప, కర్నూలు, మదనపల్లె, తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, చెన్నై ఇలా అనే ఆసుపత్రులు వెళ్లారు. గాయమైనప్పుడు అందించిన సూది మందులు వికటించడంతో అలా జరిగిందని వైద్యులు చెప్పారు.
చెన్నై ఆసుపత్రిలో గడ్డానికి శస్త్ర చికిత్స చేయాలని ఏర్పాటు చేసిన వైద్యులు చివరకు మా వల్ల కాదని చేతులెత్తేశారు. ఇప్పటి వరకు రూ.5 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టినా నయం కాలేదు. చదువుకోవాలని అనిపిస్తున్నప్పటికీ తోటి విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని బడికెళ్లలేదని కీర్తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వైద్యం అందించి బాగు చేస్తే బడికెళ్లి చదువుకుంటానని చెబుతోంది.
పెరుగుతున్న గడ్డ నొప్పి లేక పోయినప్పటికీ ఆ బాలిక చెప్పలేని బాధ అనుభవిస్తోంది. అప్పులు కావడం, ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు వెళ్లడం మానేశారు. దీంతో కీర్తనను వైద్యం అందక ఇంటికే పరిమితం అయ్యింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే బాలికకు వైద్యం చేయిస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.