Kurnool Women Cheating Rangareddy Man : రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల నటించిన అల్లరి ప్రియుడు సినిమాలో అక్కా, చెల్లెళ్ల కథను తలపించే ఘటన ఇది. కానీ, చివరకు మోసపోయింది మాత్రం ఓ యువకుడు.
ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రం పటాన్‌చేర్‌కు చెందిన యువకుడు దారుణంగా మోసపోయిన ఘటన సంచలం కల్గిస్తోంది. ఆమె మాటలు నమ్మి ఏకంగా రూ.1.23 కోట్లు ఇచ్చి జేబు గుల్ల చేసుకున్నాడు. ఆరేళ్ల పరిచయంలో ఒక్కసారీ ఆమె ముఖం కూడా చూడని ఆ యువకుడు దారుణంగా మోసపోయానిని తెలుసుకొని లబోదిబోమంటున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పత్తికొండ పోలీసులను ఆశ్రయించాడు.
చేసిన మోసం నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం పత్తికొండలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు పత్తికొండ మండలం చక్కరాళ్లకు చెందిన ఓ 35ఏళ్ల మహిళకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చేర్‌కు చెందిన యువకుడు ఆరేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడితో మాట్లాడేది. తనను ప్రేమిస్తున్నానంటూ యువకుడికి మాయ మాటలు చెప్పింది.
కొద్ది రోజలు గడిచాక కొంత డబ్బు అవసరముందని చెప్పటంతో ఫోన్ పే చేశారు బాధితుడు. మొదట రూ.వేలతో మొదలై రూ.కోటికి చేరింది. అడిగిన ప్రతి సారి అదిగో ఇదిగో అని చెబుతూ కాలం గడిపింది. తన ఆస్తులు అమ్మకానికి పెట్టానని, ఇచ్చేస్తానని చెప్పింది. ఆ యువకుడి బ్యాంకు ఖాతా ఖాళీ అవటంతో ఇంట్లో వాళ్లతోనూ, తెలిసిన స్నేహితులతోనూ, బంధువులతోనూ డబ్బు తీసుకొచ్చి ఆమె ఖాతాకు బదిలీ చేశారు. పరిస్థితిని గుర్తించిన యువకుడి తల్లిదండ్రులు, భార్య నిలదీయటంతో తాను మోసపోయిన సంగతి బయటపడటంతో కుటుంబం ఆశ్చర్యపోయింది.
"ఇన్‌స్టాగ్రామ్ రీల్ లవ్" - దండలు మార్చుకుని దారుణంగా చంపేశాడు!
ఆమెను ఒక్కసారి కూడా చూడకుండా రూ.కోటికి పైగా చెల్లించడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు. తన సోదరి ఫేస్‌బుక్ అకౌంట్ పేరిట ఇన్నాళ్లూ తనతో మాట్లాడిన విషయం జేబు గుల్లైన తర్వాత తెలుసుకున్న వారి బంధువుల సాయంతో ఆమెను ఓ సారి హైదరాబాద్‌లో పట్టుకున్నారు. వారి నుంచి తప్పించుకోవడానికి తనను విడిచిపెడితే ఇంటికి వెళ్లి తన ఆస్తులు విక్రయించి డబ్బు తెచ్చి ఇస్తానని చెప్పటంతో మరోసారి ఆమె మాటలు నమ్మి వదలి పెట్టారు.
ఇక అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో బాధితుడు పత్తికొండ పోలీసులను ఆశ్రయించారు. తన నుంచి కొట్టేసిన డబ్బుతో ఎమ్మిగనూరులో ఓ ఇల్లు, పలు ఇంటి స్థలాలు, బంగారం కొన్నట్లు బాధితుడు తెలిపారు. తాజాగా ఆ మహిళ అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడం, చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించడంతో ఆ యువకుడికి ఏమి చేయాలో పాలుపోక తిరిగీ హైదరాబాద్‌కు పయనమయ్యారు. డబ్బు కోసం ఒత్తిడి చేసినప్పుడల్లా పలుమార్లు ఆత్మహత్య పేరుతో తనను బెదిరించేదని యువకుడు వాపోయారు.
విషయాన్ని పత్తికొండ సీఐ జయన్నతో ప్రస్తావించగా ఫేస్‌బుక్ పరిచయంతో తనకు అన్యాయం జరిగిందని ఓ యువకుడు తనను కలిశాడు తప్ప రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అతడు మోసపోయిందంతా తెలంగాణాలోనే కావటంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సూచించామన్నారు.
ప్రేయసిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రియుడు- ప్రేమ పేరుతో వేధింపులు!