Wheat Flour Storage Tips: చాలా మంది ఇళ్లల్లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్లో చపాతీలను ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక చపాతీలు చేయాలంటే గోధుమ పిండి కావాల్సిందే. అయితే ఒకప్పుడు గోధుమల్ని కొని శుభ్రం చేసి.. ఎండ బెట్టి మర ఆడించి పిండి సిద్ధం చేసుకునేవారు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అంత ఓపిక లేకపోవడంతో మార్కెట్ నుంచి ఒకేసారి కేజీల కొద్ది పిండి తీసుకువచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలో కొన్నిసార్లు పిండి పురుగులు పట్టడం మనం గమనిస్తుంటాం. దీంతో కొద్దిమంది పారబోస్తే.. మరికొద్దిమంది పిండిని జల్లించి చపాతీలు చేస్తుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల గోధుమ పిండికి పురుగుల పట్టకుండా ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..
గాలి చొరబడని డబ్బాలో :గోధుమ పిండిని నిల్వ ఉంచే డబ్బా మూత వదులుగా ఉంటే గాలి తగులుతుంది. దీనివల్ల పిండికి పురుగులు పడతాయి. కాబట్టి, గోధుమ పిండినిఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేయమంటున్నారు. అయితే, పిండిని గాలి చొరబడని డబ్బాలో ఉంచినా సరే.. అప్పుడప్పుడూ తీసి కాసేపు ఎండలో ఉంచాలని.. ఇలా చేయడం వల్ల పిండిలో బ్యాక్టీరియా నశించిపోతుందంటున్నారు.
లవంగాలు, బిర్యానీ ఆకులు :సాధారణంగా లవంగాలు, బిర్యానీ ఆకులను మనం బిర్యానీలు, నాన్వెజ్ వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. అయితే, వీటిని మనం గోధుమ పిండి స్టోర్ చేసే డబ్బాలో వేయడం వల్ల పురుగులు పట్టకుండా చూసుకోవచ్చని.. అలాగే పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని సూచిస్తున్నారు.
ప్యాకెట్లో ఉంచకండి :ఎక్కువ మంది గోధుమ పిండిని కావాల్సినంత తీసుకుని మిగిలిన దానిని ప్యాకెట్లోనే ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకే పిండికి పురుగు పడుతుందని అంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే పిండిని డబ్బాలో నిల్వ చేయమంటున్నారు.