Washing Clothes Tips and Tricks:కొత్త దుస్తులు కొన్నప్పుడు తళతళా మెరిసిపోతుంటాయి. కానీ.. కొద్ది రోజుల తర్వాత అవి రంగు మారిపోతుంటాయి. ఇలా జరగకుండా దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే.. కొత్తవాటిలా మెరిసిపోవాలంటే వాటిని ఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లని నీటిలోనే ఉతకాలి
మనలో చాలామంది బాగా మురికిగా ఉండే బట్టలను వేడి నీళ్లలో నానబెట్టి ఉతుకుతారు. మురికి ఎక్కువగా ఉన్న వాటికి ఈ చిట్కా బాగానే ఉపయోగపడుతుంది. కానీ.. వాటితో పాటే మిగతా దుస్తుల్ని కూడా వేడినీటితో ఉతకడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. కొన్ని దుస్తులకైతే దారాలు పోగులు బయటికొచ్చి ముడుచుకుపోతుంటాయని చెబుతున్నారు. కాబట్టి.. సాధ్యమైనంత వరకు దుస్తుల్ని చల్లటి నీటిలో నానబెట్టి ఉతకడం మంచిదని సలహా ఇస్తున్నారు.
తిరగేసి ఆరేయాలి!
బట్టలు ఉతికే సమయంలో తప్పనిసరిగా లోపల, బయట రెండువైపులా శుభ్రం చేయాలి. ముందు బయటి భాగం శుభ్రం చేసుకుంటే తర్వాత బట్టలు తిరగేసి లోపలి భాగం సులభంగా ఉతకచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే ఉతికిన బట్టల్ని తిరగేసి, ముడతల్లేకుండా దులిపి ఆరేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బట్టలు బాగా శుభ్రపడటమే కాకుండా ముఖ్యంగా ఎండకు రంగు కోల్పోకుండా ఉంటాయని వివరించారు. అవకాశం ఉంటే నీడలో ఆరేయాలని సూచిస్తున్నారు.
లేబుల్స్ చూసి ఉతకాలి
కొత్త బట్టలు కొన్నప్పుడు వాటితో కొన్ని లేబుల్స్ వస్తాయి. అయితే, ఇంటికొచ్చాక వాటిని కత్తిరించి పక్కన పడేయకుండా.. ముందు దాని మీద ఇచ్చిన వివరాలను ఓసారి చూడాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఆ బట్టలను డ్రైవాష్ చేయాలా? లేక వాషింగ్‌మెషీన్‌లో వేయొచ్చా? లేక చేత్తో ఉతకాలా? నీడలో ఆరేయాలా లేక ఎండలోనా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తుంది. అలాగే వాటిని ఇస్త్రీ చేయచ్చా? లేదా? కూడా తెలుస్తుందని.. ఆ వివరాల ఆధారంగానే దుస్తుల్ని శుభ్రం చేస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయని అంటున్నారు.