Attention Deficit Hyperactivity Disorder in Children :సహజంగానే పిల్లలందరూ ఇంట్లో, స్కూల్లో అల్లరి చేస్తుంటారు. అయితే, ఈ అల్లరి కొంత వరకు ఉంటే పర్వాలేదు. అది శృతి మించితేనే తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతుంది. కొందరు అన్నం కూడా తినకుండా మారం చేస్తుంటారు. ఇంట్లోని సోఫా, బెడ్ మీద నుంచి తరచూ పడిపోతుంటారు. అయినా వీరికి దెబ్బ తగులుతుందన్న భయం ఉండదు. నిద్ర తక్కువగా పోతారు. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా వారే గలగలా మాట్లాడేస్తుంటారు. అయితే, ఇలా పిల్లలు గలగలా మాట్లాడడం చూసి పేరెంట్స్ ఇదేమైనా మానసిక సమస్య కావచ్చని ఆందోళన చెందుతుంటారు.
ఇలాంటి లక్షణాలున్న పిల్లలు అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్‌తో (ADHD) ఇబ్బంది పడుతున్నట్లు అర్థం చేసుకోవాలని ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి చెబుతున్నారు. పిల్లల్లో అతి చురుకుదనం, ఎక్కువ మాట్లాడడం, కుదురుగా ఉండలేకపోవడం, చదువులో వెనకబడటం, ఓ మరమనిషిలాగా ఎప్పుడూ బిజీగా ఉండడం ఇలాంటివన్నీ దానికి సంబంధించిన లక్షణాలేనని అంటున్నారు.
"మెదడు ఎదుగుదలలో లోపాల వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది. దీనికి సకాలంలో ట్రీట్మెంట్ చేయడం అవసరం. అలా చేయకపోతే పిల్లల్లో మొండితనం, అశ్రద్ధ పెరగడంతోపాటు నేర్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి." -డాక్టర్ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు )
ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే ఆలస్యం చేయకుండా పేరెంట్స్ వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలి. వైద్యులు సైకలాజికల్ అసెస్‌మెంట్ చేస్తారు. పిల్లల తెలివితేటలు, ఇతర పిల్లలతో కలిసిపోయేతత్వం, ఏకాగ్రత వంటివాటిని పరీక్షిస్తారు. ఇతర మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నదీ చూస్తారు. అవసరమైతే మెడిసిన్ ద్వారానూ నియంత్రిస్తారు. దానికితోడు కొన్ని యాక్టివిటీలూ, లెర్నింగ్ టెక్నిక్స్ సూచిస్తారు. వీటన్నింటి వల్ల పిల్లలు చదివినవి గుర్తుంచుకోగలుగుతారు. అలాగే అందరి పిల్లల్లా మామూలు జీవితం గడుపుతారని డాక్టర్ మండాది గౌరీదేవి తెలిపారు