Tomato Sesame Chutney Recipe : టమాటా చట్నీ.. ఎక్కువ మంది ఇష్టపడే పచ్చళ్లలో ముందు వరుసలో ఉంటుంది. దీన్ని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పటిలా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా తెలంగాణ స్టైల్లో నువ్వులతో కలిపి"టమాటా పచ్చడిని" తయారు చేసుకోండి. టేస్ట్ సూపర్‌గా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! పైగా దీన్ని ఎవరైనా చాలా తక్కువ సమయంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- టమాటాలు - అరకిలో
- మెంతులు - పావుటీస్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- తెల్ల నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- కారం ఉన్న పచ్చిమిర్చి - 7 నుంచి 8
- పసుపు - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని మెంతులను వేసి వేయించుకోవాలి. అవి వేగాక ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగాయనుకున్నాక తెల్ల నువ్వులు వేసుకొని చిటపటమనే వరకు వేయించుకొని దింపుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించుకోవాలి. అలా ఉడికించుకునేటప్పుడే పసుపుయాడ్ చేసుకోవాలి.
- టమాటాలు మెత్తగా మగ్గాయనుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఉన్న జార్లో వేసుకోవాలి. అలాగే అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పచ్చడికి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
- తాలింపు చక్కగా వేగాక దింపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా కమ్మని "టమాటా నువ్వుల పచ్చడి" రెడీ!
- ఇది వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీఇలా దేనిలో వేసుకొని తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! అలాగే ఈ పచ్చడిని వాటర్ వేయకుండా ప్రిపేర్ చేసుకుంటే చలికాలంలో అయితే కనీసం 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది!
ఇవీ చదవండి :
పదే పది నిమిషాల్లో - పసందైన "పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి" - టేస్ట్ వేరే లెవల్ అంతే!
చూస్తేనే నోరూరిపోయే తెలంగాణ స్టైల్ "చుక్కకూర పచ్చడి" - గోంగూర చట్నీని మించిన టేస్ట్!