Snake Shedding Skin :పాము శరీరంపై వచ్చే కొత్త చర్మం పొరనే కుబుసం అంటారు. పాములు కుబుసం విడిచిపెట్టడం అత్యంత సహజమైన ప్రక్రియ అని పరిశోధకులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి కేవలం పాముల్లోనే కనిపిస్తుంది. పాములు కుబుసం విడవకుంటే ముందుగా అవి చూపును కోల్పోతాయి. వేటాడేందుకు శరీరం సహకరించక ఇతర జంతువుల దాడికి గురవుతాయి. కుబుసంతో బొరియల్లోనే ఉండిపోతే నీరసించి చనిపోతాయి.
అసలు పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి? ఎన్ని రోజులకు ఒకసారి కుబుసం విడుస్తాయి? కుబుసం పదార్థాన్ని ముట్టుకోవచ్చా? కుబుసం విడిచే సమయంలో వాటిని చూస్తే ఏం జరుగుతుంది? అనే సందేహాలపై పూర్తి సమాచారం తెలుసుకుందాం.
గుర్రాలు ఎందుకు పడుకోవు? - మీకు 'హార్స్ పవర్' అంటే తెలుసా?
కొన్ని జాతుల పాములకు కొత్త పొర ఏర్పడడం వల్ల పై పొర (కుబుసం) వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే పాములు కుబుసాన్ని ఒకేసారి వదిలేస్తాయి. పాముల శరీరం పెరుగుతున్నా కొద్దీ వాటి చర్మం కూడా కొత్తగా రూపొందుతుంది. అందుకే అవి కొత్త చర్మం రాగానే పాత చర్మాన్ని వదిలేస్తాయి.
కుబుసం వదలడం అంత సులభం కాదు. అందుకే పాములు కుబుసం విడవడానికి ముందుగా తమ తలను నేలకేసి రుద్దుకుంటుంది. కొద్దిగా చీలిక రాగానే మొత్తం చర్మం వదిలిపోయేలా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అది దాదాపు రహస్యప్రదేశంలోనే ఉంటుంది. అందుకే పొదలు, పుట్టలు, తెట్టెగోడలు, ఇంటి గోడల కన్నాల్లో పాము కుబుసాలు కనిపించడానికి కారణం అదే.
ప్రపంచంలో మూడు వేలకు పైగా పాము జాతులు ఉండగా దాదాపు అవన్నీ కుబుసం విడుస్తాయట. పాము పుట్టిన దగ్గర్నుంచి తన జీవితకాలంలో పలు సందర్భాల్లో కుబుసం విడుస్తుంది. శరీరం పెరుగుతున్నపుడల్లా పాత చర్మం బిగుతుగా మారి అసౌకర్యంగా ఉంటుంది. అది వేగంగా కదిలేందుకు, ఆహారాన్ని సేకరించుకునేందుకు ఇది ఆటంకంగా మారుతుంది. అందుకే అది బిగుతుగా మారిన పాత చర్మాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది.