Shahi Dum Aloo Recipe in Telugu :మనలో ఎక్కువ మంది బంగాళదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా చాలా ఇష్టంగా తింటారు. అయితే, మీరు ఆలూతో ఇప్పటి వరకు ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఈసారి కాస్త డిఫరెంట్‌గా "రెస్టారెంట్ స్టైల్ షాహీ దమ్ ఆలూ" కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! చపాతీ, రోటీ, పులావ్, బిర్యానీ వంటి వాటిల్లోకి మంచి కాంబినేషన్‌గా నిలుస్తుంది ఈ కర్రీ. ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బేబీ పొటాటోలు - 350 గ్రాములు
- పెరుగు - 1 కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- పసుపు - పావుటీస్పూన్
- ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
- గరంమసాలా - అరటీస్పూన్
- కారం - 1 టేబుల్‌స్పూన్
- ఆయిల్ - 3 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
- సోంపు గింజలు - పావుటీస్పూన్
- జీలకర్ర - పావుటీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- క్రీమ్ - 1 టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
మసాలా పేస్ట్ కోసం :
- ఆయిల్ - 3 టేబుల్‌స్పూన్లు
- లవంగాలు - 5
- యాలకులు - 3
- బిర్యానీ ఆకులు - 2
- మిరియాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- షాజీరా - అరటీస్పూన్
- ఉల్లిపాయ చీలికలు - 1 కప్పు
- జీడిపప్పు పలుకులు - 6
- పెరుగు - 3 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 2(సన్నగా తరుక్కోవాలి)
లంచ్ బాక్స్ స్పెషల్ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్" - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బేబీ పొటాటోలనుమెత్తగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ బేబీ పొటాటోలు అందుబాటులో లేకపోతే పెద్ద సైజ్ ఆలూను ఉడికించి పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది.
- అనంతరం రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, మిరియాలు, షాజీరా వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయ చీలికలు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి వేగాక జీడిపప్పు పలుకులు వేసి కొద్దిసేపు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమం, పెరుగు, పచ్చిమిర్చి తరుగు, కాసిన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, గరంమసాలా, ధనియాల పొడి, పసుపు, కారం వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచాలి.
దాబా స్టైల్ "ఆలూ భునా మసాలా" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
- ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక ఉడికించుకున్న బేబీ పొటాటోలను ఫోర్క్‌తో గుచ్చి కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలూ వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆపై ఆలూని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో సోంపు గింజలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుమిశ్రమాన్ని వేసుకొని కలుపుతూ పైన ఆయిల్ తేలేంత వరకు వేయించాలి.
- అలా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో నుంచి కూడా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఆ టైమ్‌లో మిశ్రమం అడుగుపడుతున్నట్లనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
- మిశ్రమం ఆవిధంగా ఉడికిందనుకున్నాక ఒక కప్పు హాట్ వాటర్, వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోలు వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టొచ్చు.
- అలా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో క్రీమ్, 1 టీస్పూన్ నెయ్యి, కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి చక్కగా కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ షాహీ ఆలూ దమ్" కర్రీ రెడీ!
లంచ్‌లోకి చిటికెలో చేసుకునే "బంగాళదుంప ముద్ద కూర" - వేడి వేడి అన్నంలో తింటే అమృతమే!