తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అయ్యప్ప స్వాములు మెచ్చే "సాత్విక భోజనం" - ఉల్లి, వెల్లుల్లి లేకుండా చక్కగా సిద్ధం చేసుకోండిలా!

- దీక్షాదారులకు రుచికరమైన భిక్ష - కార్తికమాసంలో ఉల్లి, వెల్లుల్లి తినని వారికీ చక్కటి విందు

Satvik Lunch For Ayyappas
Satwik Lunch For Ayyappas (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Sattvic food For Ayyappas:కార్తిక మాసం పూజలకు పెట్టింది పేరు. స్నానాలు, పూజలు, ఉపవాసాలు, దీపారాధనలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇక కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. అత్యంత నియమ నిష్ఠలతో దీక్ష కొనసాగిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతారు. నిత్యం అయ్యప్పస్వామి సేవలో తరిస్తారు. కటిక నేలపై నిద్రిస్తూ.. ఉల్లి వెల్లుల్లి లేకుండా కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. అది కూడా ఒక్క పూట మాత్రమే. సాత్విక భోజనం జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది. ఈ క్రమంలో అయ్యప్పలకు అనువుగా ఉండే సాత్విక భోజనాన్ని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో చూద్దాం. వీటికోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. పైగా పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు. మరి ఆ సాత్విక భోజనం తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

టమాటా పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • టమాటాలు - 3
  • కందిపప్పు - అరకప్పు
  • పచ్చిమిర్చి - 3
  • వేడి నీరు - ఒకటిన్నర కప్పు
  • నెయ్యి - 2 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • కారం - 1 టీస్పూన్​
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

అరటికాయ మెంతి వేపుడుకు కావాల్సిన పదార్థాలు:

  • పచ్చి అరటికాయలు - 2
  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • అల్లం తరుగు - అర టేబుల్​ స్పూన్​
  • పచ్చిమిర్చి - 3
  • సన్నగా తరిగిన మెంతి కూర - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్​
  • నిమ్మకాయ రసం - 1 టీ స్పూన్​

సొరకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

  • సొరకాయ ముక్కలు - ముప్పావు కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం - కొద్దిగా
  • పెరుగు - ఒకటిన్నర కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • మినపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1 టేబుల్​ స్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - పావు టీస్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

టమాటా పుదీనా పచ్చడి:

  • పల్లీలు - 2 టేబుల్​ స్పూన్లు
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 8
  • టమాటలు - 4
  • పుదీనా ఆకులు - 1 కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • నానబెట్టిన చింతపండు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా టమాట పప్పు ఉడకబెట్టుకోవాలి. అందుకోసం కుక్కర్​లో టమాటా ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, పచ్చిమిర్చి, వేడి నీరు పోసి మూత పెట్టి మూడు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ఈలోపు పచ్చి అరటికాయలను ఉడకబెట్టుకోవాలి. అందుకోసం అరటికాయను చెక్కు తీసి ముక్కలుగా కట్​ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ మీద గిన్నె పెట్టి నీరు పోసి వేడి చేసుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు అరటికాయ ముక్కలు వేసి 80 శాతం ఉడికించుకుని నీళ్లు లేకుండా వడకట్టి పక్కకు పెట్టుకోవాలి.
  • అలాగే సొరకాయను కూడా ఉడికించుకోవాలి. అందుకోసం.. సొరకాయ పొట్టు, గింజలు తీసి సన్నగా ముక్కలుగా కట్​ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ మీద గిన్నె పెట్టి నీరు పోసి వేడి చేసుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు సొరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకుని నీళ్లు లేకుండా వడకట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఉడుకుతుంది. దీంతో స్టవ్​ ఆఫ్​ చేసుకుని స్టీమ్​ పోయేంతవరకు అలానే ఉంచండి.
  • ఇప్పుడు అరటికాయ మెంతి వేపుడు సిద్ధం చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ మీద పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం వేసి అల్లాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి నిమిషం పాటు వేయించుకోవాలి. అనంతరం సన్నగా తరిగిన మెంతి ఆకు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. పొడులు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న అరటికాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ 8 నిమిషాలపాటు మగ్గించాలి. అరటికాయ మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి నిమ్మరసం పిండుకుని సర్వ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు టమాటా పుదీనా పచ్చడి ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్​ చేసి పాన్​ పెట్టి పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నూనె వేసి పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం టమాటా ముక్కలు వేసి ఓ నాలుగు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికి తోలు ఊడిపోతున్నప్పుడు పుదీనా ఆకులు వేసి బాగా కలిపి ఓ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. పుదీనా మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి టమాట మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్​లో తీసుకుని అందులోకి ఉప్పు, పసుపు, నానబెట్టిన చింతపండు వేసి కొంచెం బరకగా గ్రైండ్​ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
  • పప్పును తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం కుక్కర్​లోని పప్పును మెదుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేసి ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేపాలి. చివరన కారం వేసి మగ్గించాలి. చింతపండు నుంచి తీసిన అరకప్పు రసాన్ని తాలింపులో పోసి, ఓ పొంగు వచ్చే వరకు మగ్గించాలి. ఆ తర్వాత మెదుపుకున్న పప్పు వేసి ఓ నాలుగు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి.
  • సొరకాయ పెరుగు పచ్చడి కోసం.. ఓ కప్పులో పెరుగు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఓ 30 సెకన్ల పాటు వేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి. ఈ తాలింపును సొరకాయ పెరుగు మిశ్రమంలో కలుపుకుంటే సరి. చివరగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్​ చేసుకునేంతవరకు ఫ్రిజ్​లో ఉంచాలి.
  • ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఓ ప్లేట్​లోకి అన్నం, టమాట పప్పు, అరటికాయ మెంతి వేపుడు, టమాటా పుదీనా పచ్చడి, సొరకాయ పెరుగు పచ్చడి, అప్పడం రెడీ చేసుకుంటే అయ్యప్ప స్వాములు తినే సాత్విక భోజనం రెడీ. దీన్ని కేవలం అయ్యప్పలు మాత్రమే కాదు కార్తికమాసంలో ఉల్లి, వెల్లుల్లి తిననివారు కూడా చేసుకోవచ్చు.

సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ : తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా" - దీని టేస్ట్ ముందు బిర్యానీ కూడా బలాదూర్!

చికెన్​, మటన్​ మాత్రమే కాదు, టమాటలతోనూ "దమ్​ బిర్యానీ" చేసుకోవచ్చు!- టేస్ట్​ సూపర్​గా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details