తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తెలంగాణ ఫేమస్ వంటకం "సర్వపిండి" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్​కి ఫిదా అవ్వాల్సిందే! - How to Make Sarva Pindi - HOW TO MAKE SARVA PINDI

Sarva Pindi Recipe in Telugu : సర్వపిండి.. తెలంగాణలో ఈ పిండి వంటకానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు! కామన్ మ్యాన్ పిజ్జాగా చెప్పుకునే ఈ వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టపడతారు. అయితే, మీరూ ఎప్పుడైనా దీన్ని టేస్ట్ చేశారా? లేదంటే మాత్రం ఇప్పుడే ఓసారి సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. రుచి అద్దిరిపోతుంది!

Telangana Style Sarva Pindi
Sarva Pindi Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 26, 2024, 1:12 PM IST

How to Make Telangana Style Sarva Pindi : తెలంగాణ ఫేమస్ పిండి వంటకాల్లో "సర్వపిండి" ముందు వరుసలో ఉంటుంది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో సర్వప్ప, గిన్నె పిండి, తపాలా చెక్క.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కామన్ మ్యాన్ పిజ్జాగా పేరొందిన సర్వపిండిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా దీని తయారీ కోసం ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ.. సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - 3 కప్పులు
  • పల్లీలు - పావు కప్పు
  • జీలకర్ర - ముప్పావు చెంచా
  • కారం - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
  • పుదీనా తరుగు - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • శనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • నూనె - తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా శనగపప్పును ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. ఈలోపు రెసిపీలోకి కావాల్సిన పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకును సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పొడవాటి ప్లేట్​లో బియ్యప్పిండి తీసుకోవాలి. ఆపై అందులో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, కారం, నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు తరుగు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండి మాదిరిగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడే నానబెట్టుకున్న శనగపప్పునూ అందులో వేసుకొని మధ్యమధ్యలో నీళ్లు చిలకరించుకుంటూ గట్టిగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కచ్చితంగా అడుగు మందం ఉన్న పాన్ తీసుకొని దాని లోపల అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిండి పాన్​కి అతుక్కుపోదు.
  • తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పాన్​లో అన్ని వైపులా సమానంగా చేతితో పిండిని గుండ్రంగా, పల్చగా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే, మరీ పల్చగా కాకుండా ఊతప్పంలో సగం మందంగా ఉండేలా చూసుకోవాలి.
  • అనంతరం స్ప్రెడ్ చేసుకున్న రొట్టెలో మధ్యలో అక్కడక్కడ వేలితో చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి. తర్వాత ఆ రంధ్రాల్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను చుక్కలు చుక్కలుగా వేసుకోవాలి. ఇలా చేస్తే పిండి అంతటా ఒకేలా ఉడుకుతుంది.
  • ఇప్పుడు ఆ పాన్​ను స్టౌపై ఉంచి మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి 10 నుంచి 12 నిమిషాల పాటు కాలనివ్వాలి. అంటే.. సర్వపిండిని క్రిస్పీగా మారే వరకు కాల్చుకోవాలి. ఆలోపు మీకు మరో మూకుడు ఉంటే ఇంకో సర్వప్పను ప్రిపేర్ చేసుకోవచ్చు.
  • ఇక 10 నుంచి 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే "సర్వపిండి" మీ ముందు ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details