Chicken Tikka Dum Biryani Recipe : సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో నాన్‌వెజ్ ఘుమఘుమలు ఉండాల్సిందే. అయితే, ఈ ఆదివారం రొటీన్‌గా చికెన్ కర్రీ, మటన్ కూర వంటివి కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఈ రెసిపీని ట్రై చేయండి. అదే.. హైదరాబాదీ స్టైల్ "చికెన్ టిక్కా దమ్ బిర్యానీ". దీన్ని బ్యాచిలర్స్‌తో పాటు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి రైస్ - 2 కప్పులు
- ఫ్రైడ్ ఆనియన్స్ - 2 టేబుల్‌స్పూన్లు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- పాలు - అరకప్పు
చికెన్ మారినేషన్ కోసం :
- బోన్‌లెస్ చికెన్ - అరకేజీ
- నిమ్మరసం - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పెరుగు - అరకిలో
- కసూరి మేతి - 1టీస్పూన్
- ఆవనూనె - 1 టేబుల్‌స్పూన్
- కారం - 1 టేబుల్‌స్పూన్
- గరంమసాలా - 1 టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- యాలకుల పొడి - అరటీస్పూన్
- సొంఠి పొడి - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కశ్మీరి చిల్లీ పౌడర్ - 1 టీస్పూన్
- రెడ్ ఫుడ్ కలర్ - పావుటీస్పూన్
బిర్యానీ కోసం :
- నెయ్యి - 200 గ్రాములు
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- పుదీనా తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- ఫ్రైడ్ ఆనియన్స్ - అర కప్పు
- లవంగాలు - 7
- బిర్యానీ ఆకు - 1
- యాలకులు - 4
- దాల్చిన చెక్క - రెండు ఇంచుల ముక్క
- మరాటి మొగ్గలు - 2
- షాహిజీరా - 1 టేబుల్‌స్పూన్
- అనాస పువ్వులు - 2
- జాపత్రి - 1
- నల్ల యాలకులు - 2
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 4
- యాలకుల పొడి - పావు చెంచా
- కుంకుమ పువ్వు - 1 టీస్పూన్
రొటీన్ చికెన్ కర్రీ వండుతున్నారా? - గ్రేవీ చికెన్ ఫ్రై, స్పెషల్ రైస్ - ఇలా ప్రిపేర్ చేయండి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శుభ్రంగా కడిగిన మీడియం సైజ్ బోన్‌లెస్ చికెన్‌ను తీసుకోవాలి. ఆపై అందులో అరచెక్క నిమ్మరసం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కోట్ చేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- అరగంట తర్వాత ఆ చికెన్‌లో పెరుగు, కసూరి మేతి, ఆవనూనె, కారం, కొద్దిగా ఉప్పు, గరంమసాలా, వేయించిన జీలకర్ర పొడి, యాలకుల పొడి, సొంఠి పొడి, ధనియాల పొడి, కశ్మీరి కారం, రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని 1 గంటపాటు నాననివ్వాలి. వీలైతే ఫ్రిజ్‌లో ఉంచితే ఇంకా మంచిది.
- ఇప్పుడు స్టౌపై తప్పనిసరిగా అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకొని 100 గ్రాముల నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక గంటపాటు నానిన మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద ముక్కను మెత్తగా కుక్ అవ్వనివ్వాలి. మరీ, మెత్తగా, సాఫ్ట్‌గా మాత్రం ఉడికించుకోవద్దు. అందుకోసం 15 నుంచి 20 నిమిషాల పాటు టైమ్ పట్టొచ్చు.
- ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో నుంచి కేవలం చికెన్ ముక్కలను మాత్రమే గరిటెతో ఏరి తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం చల్లారినటువంటి గ్రేవీలో సన్నని కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మూడు టేబుల్స్పూన్ల వరకు వాటర్ పోసి మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ బర్నర్ మీద ఒక గ్రిల్ పెట్టి దానిపై చల్లారినటువంటి చికెన్ ముక్కలను ఉంచి తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. అన్ని వైపులా చికెన్ ముక్కలు మంచిగా కాల్చుకున్నాక దింపి పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై మరో పాన్ పెట్టుకొని రెండు లీటర్ల వరకు నీటిని పోసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మరాటి మొగ్గలు, షాహిజీరా, అనాస పువ్వులు, జాపత్రి, నల్ల యాలకులు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలిపి ఎసరుని తెర్ల కాగనివ్వాలి.
"ఫిష్ ఫ్రై బిర్యానీ" ఎప్పుడైనా ట్రై చేశారా? - ఈ టేస్ట్ అస్సలు మర్చిపోలేరు!
- ఎసరు బాగా మరుగుతున్నప్పుడు గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వడకట్టి వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై హై ఫ్లేమ్ మీద బియ్యాన్ని 60% వరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ఆవిధంగా ఉడికించుకున్నటువంటి రైస్‌ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా మిశ్రమంలో రెండు లేయర్స్‌గా వేసుకోవాలి. ఆపై మిగిలిన రైస్ మిశ్రమాన్ని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అది 70% ఉడుకుతుంది. దాన్ని మరో లేయర్‌గా వేసుకోవాలి. తర్వాత ఇంకో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మిగతా రైస్ 80% వరకు కుక్ అవుతుంది. దాన్ని ఇంకో లేయర్‌గా వేసుకోవాలి.
- దీంతో పాటు ఎసరులో మిగిలిన మసాలాలన్నింటిని వేసి గరిటెతో రైస్‌ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో 100 గ్రాముల నెయ్యిని రైస్‌పై అప్లై చేసుకోవాలి. అలాగే అన్నం పైన యాలకుల పొడి, 1 టీస్పూన్ కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని, పాలు పోసుకోవాలి.
- ఆ తర్వాత గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కలను కూడా రైస్ పైన పేర్చుకోవాలి. ఆపై గిన్నె అంచుల వెంబడి ఆవిరి పోకుండా గోధుమపిండి లేదా మైదా పిండిని ఉండగా చేసి పెట్టి తర్వాత మూతపెట్టి అవసరమైతే కాస్త బరువు ఉంచి దమ్ చేసుకోవాలి.
- అంటే.. హై ఫ్లేమ్ మీద 8 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం స్టౌ ఆఫ్ చేసి 20 నిమిషాలు అలా వదిలేసి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "చికెన్ టిక్కా దమ్ బిర్యానీ" రెడీ!
చిట్టిముత్యాలతో స్పైసీ "మటన్ దమ్ బిర్యానీ"- ఇలా చేస్తే ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది!