Telangana Special Sarva Pindi Recipe : సర్వపిండి.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. ఇది తెలంగాణ ఫేమస్ పిండి వంటకాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్నే సర్వప్ప, గిన్నె పిండి, తపాలా చెక్క.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కామన్ మ్యాన్ పిజ్జాగా పేరొందిన ఈ సర్వపిండిని.. చలికాలంలోవేడివేడిగా చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా భలే ఉంటుంది! అది కూడా ఏదైనా నాన్‌వెజ్ కాంబినేషన్‌తో తిన్నారంటే.. కలిగే ఆ ఫీలింగ్ మరింత అద్భుతమని చెప్పుకోవచ్చు! ఏంటీ వింటుంటేనే నోరూరిపోతుందా? మరి, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా సర్వపిండిని ప్రిపేర్ చేసుకోండి.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 3 కప్పులు
- పచ్చిశనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- పల్లీలు - పావు కప్పు
- జీలకర్ర - ముప్పావు చెంచా
- కారం - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 3
- నువ్వులు - 1 టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌స్పూన్
- పుదీనా తరుగు - 1 టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం :
- ముందుగా శనగపప్పును ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. ఆలోపు రెసిపీలోకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి.
- పల్లీలను వేయించుకొని పొట్టు తీసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యప్పిండి, వేయించి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, కారం, జీలకర్ర, నువ్వులు, ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై ఆ మిశ్రమంలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి. అలా పిండిని కలుపుకునేటప్పుడే గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పునూ వేసుకొని మధ్యమధ్యలో కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ గట్టిగా చేతితో వత్తుతూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత కచ్చితంగా అడుగు మందం ఉన్న పాన్ తీసుకొని దాని లోపల అన్ని సైడ్స్ కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిండి పాన్‌కి అతుక్కుపోదు.
- ఆపై మీరు కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పాన్‌లో అన్ని వైపులా సమానంగా చేతితో గుండ్రంగా, పల్చగా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే, మరీ పల్చగా కాకుండా ఊతప్పంలో సగం మందంగా ఉండేలా సర్వప్పను పాన్‌లో వత్తుకోవాలి.
- అనంతరం స్ప్రెడ్ చేసుకున్న రొట్టెలో మధ్యలో అక్కడక్కడ వేలితో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఆపై ఆ రంధ్రాల్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను చుక్కలు చుక్కలుగా వేసుకోవాలి. ఇలా చేస్తే పిండి అంతటా ఒకేలా ఉడుకుతుందని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు ఆ పాన్‌ను స్టౌపై ఉంచి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 12 నుంచి 15 నిమిషాల పాటు కాలనివ్వాలి. అంటే.. సర్వపిండి చక్కగా ఉడికి క్రిస్పీగా మారే వరకు కాల్చుకోవాలన్నమాట.
- ఇందులోని టేస్ట్ అంతా మీరు సర్వపిండినిక్రిస్పీగా కాల్చుకోవడంలోనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆలోపు మీకు ఇంకో మూకుడు లేదా పాన్ ఉంటే అందులో మరో సర్వప్పను ప్రిపేర్ చేసుకోవచ్చు.
- ఇక 12 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా, క్రిస్పీగా ఉండే తెలంగాణ స్టైల్ "సర్వపిండి" రెడీ!