Rathasapthami Payasam Recipe in Telugu : చాలా మంది స్వీట్ రెసిపీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పండగలు, శుభకార్యాల టైమ్‌లో రకరకాల తీపి వంటకాలను ఎక్కువగా చేసుకుంటుంటారు. అలాగే, కొందరు తినాలనిపించినప్పుడు బియ్యం, సేమియాతో పాయసాన్ని చేసుకొని ఆరగిస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా 'రథసప్తమి పాయసాన్ని' ప్రిపేర్ చేసుకొని చూడండి. ఆగమ శాస్త్రాల ప్రకారం తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది! ఇంటిల్లిపాదీ చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - తగినన్ని
- నెయ్యి - కొద్దిగా
- బెల్లం తరుగు - బియ్యానికి సమాన పరిమాణం
- యాలకులు - 5
- చిన్నసైజ్ చెరకు గడ - 1
తయారీ విధానం :
- రథసప్తమి పాయసం తయారీకి కొన్ని ఆగమశాస్త్రాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
- ముఖ్యంగా ఇందుకోసం తీసుకునే బియ్యాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు పిడికిళ్ల పరిమాణంలో తీసుకోవాలి. లేదా వారి చేతితో మూడుసార్లైనా బియ్యం తీసుకోవాలి.
- అలాగే, రథ సప్తమి పాయసానికి తీసుకునే బియ్యాన్ని నీటితో కడగకూడదు. అందుకు బదులుగా కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని దాంతోనే రైస్‌ని శుద్ధి చేసుకోవాలన్నది ఆచారం.
- అయితే, మీరు ఆర్గానిక్ బియ్యం వాడితే కడగాల్సిన పనిలేదు. కానీ, అదే మార్కెట్లో లభించే బియ్యం వాడుతున్నట్లయితే ఓసారి కడిగి బియ్యానికి ఆవు నెయ్యి పట్టించడం మంచిదట.
- అనంతరం పాయసం వండే పొయ్యి లేదా స్టౌకు నాలుగు వైపులా ముగ్గు వేసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి.
- ఇప్పుడు మీ ఇంటిల్లిపాదికీ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా పరిమాణంలో ఉండే ఒక కొత్త ఇత్తడి లేదా రాగి పాత్రను తీసుకోవాలి.
- ఆపై దాన్ని శుభ్రంగా కడిగి పసుపు పట్టించాలి. తర్వాత పాత్ర చుట్టూ గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై అలంకరించుకున్న పాత్రను పెట్టుకొని అందులో కేవలం దేశవాళీ ఆవు పాలను మాత్రమే పోసుకోవాలి. ఆవు పాలను మీరు తీసుకునే బియ్యానికి నాలుగింతలు తీసుకోవాలి. అంటే.. మీరు పావు కిలో బియ్యం తీసుకుంటే లీటర్ పైనే పాలు పోసుకోవాలి.
- ఆపై పాలను పూర్తిగా పొంగే వరకు మరిగించుకోవాలి. అయితే, మరిగించుకునే సమయంలో పాలు పొంగుతున్నప్పుడు మంటను తగ్గించడం, ఊదడం కానీ చేయరాదు. పాల పొంగు లక్ష్మీ కటాక్షం అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ప్రసాదం చేసుకునేటప్పుడు స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ప్రిపేర్ చేసుకోవడం మంచిది.
- పాలు పొంగు వచ్చిన వెంటనే నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఆపై కలపడానికి గరిటె వాడకుండా మట్టి లేకుండా శుభ్రంగా ఉన్న చెరకు గడను తీసుకొని కలుపుకోవాలి.
- తర్వాత చెరకు గడను అలాగే ఆ మిశ్రమంలో వదిలేయండి. ఇలా చేయడం ద్వారా పాలు పొంగవు. అయితే, బియ్యం ఉడకవని భావించి వాటర్ అస్సలే పోయకూడదు. ఒకవేళ మీరు పాతబియ్యంతో పాయసాన్ని చేసుకుంటున్నట్లయితే కొద్దిగా పాలను ఎక్కువ పోసుకోవాలి. కానీ, నీళ్లు మాత్రం అస్సలే పోయకూడదు.
- కాసేపటికి బియ్యం మెత్తగా ఉడుకుతుంది. అలా ఉడికిందని తెలవాలంటే చెరుకు గడతో కొద్దిగా తీసుకొని చేతితో మెదిపితే తెలుస్తుంది.
- అలా ఉడికిందనుకున్నాక ఆర్గానిక్ బెల్లం తురుమును అందులో వేసుకొని కలుపుకోవాలి. అయితే, మీకు ఆర్గానిక్ బెల్లం అందుబాటులో లేనట్లయితే మామూలు బెల్లం వేసుకోవచ్చు. కాకపోతే ఆ టైమ్‌లో స్టౌ ఆఫ్ చేసి నార్మల్ బెల్లం తురుము వేసి కలిపి అలా వదిలేయాలి. కాసేపటికి బెల్లం నిదానంగా కరుగుతుంది. ఇలా చేయడం ద్వారా పాలు విరగవని గుర్తుంచుకోవాలి.
- ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద కాసేపు మాత్రమే ఉంచి చివరగా యాలకులను పొడిలా చేసి వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే ఆగమశాస్త్రాల ప్రకారం ప్రిపేర్ చేసుకున్న "రథసప్తమి పాయసం" రెడీ!
ఇవీ చదవండి :
పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!
ఎంతో రుచికరమైన శబరిమల "అరవణ ప్రసాదం" - ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!