Pine Nuts Health Benefits :డ్రై ఫ్రూట్స్ అనగానే మనలో చాలా మందికి.. బాదం, పిస్తా, జీడిపప్పు, అంజీర్, కిస్‌మిస్ వంటివి మాత్రమే గుర్తుకొస్తుంటాయి. కానీ.. "పైన్ నట్స్" గురించి మాత్రం పెద్దగా తెలియదు. వీటినే చిల్గోజా గింజలని కూడా అంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాలు అనేకం :
పైన్ నట్స్.. (national library of medicine రిపోర్ట్)తీపీ వెన్న కలగలసినట్టుగా ఎంతో కమ్మని రుచిగా ఉంటాయి. చాలా ఖరీదైన డ్రై ఫ్రూట్స్ ఇవి. విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ గింజల్లోని ఒలియాక్ మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2001లో "బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పైన్ గింజలను తీసుకోవడం వల్ల LDL (చెడు) కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే HDL (మంచి) కొలెస్ట్రాల్ పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ న్యూట్రిషనల్ సైన్సెస్ విభాగానికి చెందిన 'డాక్టర్ పెన్నీ మార్గరెట్ క్రిస్-ఈథర్టన్' పాల్గొన్నారు.
బరువు తగ్గుతారు! :
పైన్ నట్స్‌లోని పినొలెనిక్ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్‌ల విడుదలకు తోడ్పడటం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ప్రొటీన్, ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- చిల్గోజా గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మూత్రపిండాలు, కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి.
- మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు పైన్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
- పైన్ గింజలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యాంగా, బలంగా ఉండేలా తోడ్పడుతుంది.
- పైన్ నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి.
- బాదంలో మాదిరిగానే చిల్గోజా గింజల్లోనూ విటమిన్-ఇ శాతం ఎక్కువ. ఫలదీకరణ తర్వాత రూపొందిన కంకులు పక్వ దశకు రావడానికి కనీసం రెండుమూడేళ్లు పడుతుందట. అందుకే వీటి ధర చాలా ఎక్కువ.
- లోపల పప్పులు క్రీమ్ కలర్‌లోనూ పైనుండే తొక్క గోధుమ కలర్‌లోనూ ఉంటుంది. పశ్చిమ హిమాలయాల్లోని అడవుల్లో పెరిగే చిల్గోజా గింజలైతే సన్నగా పొడవుగా ఉంటాయి.
- తియ్యని వాసనతో ఉండే పైన్‌నట్ ఆయిల్ అయిన బోర్నియాల్ చర్మాన్ని డ్రై కాకుండా చేస్తుంది. వీటిని సంపద్రాయ వైద్యంలోనూ.. అలాగే బ్యూటీ ఉత్పత్తుల్లోనూ ఎక్కువగా వాడుతుంటారు.