How to Make Nawabi Semai Recipe : మీరు ఇప్పటి వరకు సేమియాతో పాయసం, ఉప్మా, పులిహోరవంటి వివిధ రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా నవాబుల కాలం నాటి కస్టర్డ్ సేమియా రెసిపీని ప్రయత్నించారా? లేదంటే మాత్రం ఈ దీపావళి వేళ ఓసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! మరి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- సన్నని సేమియా - 200 గ్రాములు
- బాదం - 9
- జీడిపప్పు పలుకులు - 9
- యాలకులు - 4
- పంచదార - 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
కస్టర్డ్ తయారీ కోసం :
- పాలు - అరలీటర్
- కార్న్ ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- చక్కెర - పావు కప్పు
- సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ - కొన్ని
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పాయసానికి వాడే సేమియాను కాకుండా సన్నగా పొడవుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. ఆపై ఆ సేమియాను ఒక బౌల్లోకి తీసుకొని చేతితో తినడానికి వీలుగా స్మాల్ పీసెస్‌గా బాగా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం, జీడిపప్పుపలుకులు, యాలకులు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత అందులో నుంచి సగం బాదం, జీడిపప్పు పొడిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్లో ఉన్న మిగతా సగం పొడిలో పంచదార యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక అందులో ముందుగా క్రష్ చేసుకొని పెట్టుకున్న సేమియాను వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఆవిధంగా ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి మిశ్రమాన్ని వేసుకొని మరో 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా చక్కెర పొడి అంతా బాగా కరిగిపోయి సేమియాకు చక్కగా పడుతుంది.
- అలా ఫ్రై చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ సేమియా మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- తర్వాత దాన్ని రెండు సమాన భాగాలుగా సెపరేట్ చేసుకోవాలి. ఆపై మీరు ఏ బౌల్లో అయితే స్వీట్‌ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అందుకోసం రెండు బౌల్స్ తీసుకోవాలి.
- తర్వాత ఒక భాగం సేమియా మిశ్రమాన్ని ఆ రెండు బౌల్స్‌లో ఈక్వల్‌గా తీసుకొని ఒక చిన్న గిన్నెతో పైభాగం సమానంగా ఉండేలా వత్తుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం రెసిపీలోకి కావాల్సిన కస్టర్డ్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో అర కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని మిగతా పాలను పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు బౌల్లో తీసుకున్న పాలలో కార్న్ ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్, ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకున్న సగం జీడిపప్పు బాదం పొడి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
- పాలు మరిగి కొంచం చిక్కగా మారాయనుకున్నాక.. మీరు మిక్స్ చేసుకొని పెట్టుకున్న పాల మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అప్పుడు మిశ్రమం చిక్కగా, క్రీమీగా వస్తుంది. ఆవిధంగా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక చక్కెర యాడ్ చేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆపై దింపుకొని తరుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కస్టర్డ్ రెడీ అయిపోతుంది.
- ఇక ఇప్పుడు మీరు రెండు బౌల్స్‌లో సమానంగా వత్తుకొని పెట్టుకున్న సేమియా మిశ్రమంలో కస్టర్డ్‌ను రెండు సమాన భాగాలుగా పోసుకోవాలి. ఆపై పక్కకు తీసుకొని పెట్టుకున్న మరో భాగం సేమియా మిశ్రమాన్ని వాటిపై ఈక్వల్‌గా వేసి సమానంగా అప్లై చేసుకోవాలి.
- ఇక చివరగా దానిపై కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్వీట్‌ని డైరెక్ట్‌గా తినడం కంటే రెండు మూడు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "నవాబి కస్టర్డ్ సేమియా" రెసిపీ రెడీ!
ఇవీ చదవండి :
ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!
నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్" - ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్ టేస్ట్!