Navratri 2024 Prasadam Recipes : దేశవ్యాప్తంగా నేటి నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులలో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజులు 9 రూపాల్లో పూజించడమే కాకుండా ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి వాటిల్లో అమ్మవారికి ఇష్టమైన.. శాకాన్నం, లౌకీ హల్వా అనే రెండు ప్రత్యేకమైన రెసిపీలు తీసుకొచ్చాం. ఇంతకీ, ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శాఖాన్నం :
కావాల్సిన పదార్థాలు :
- అర కిలో - బియ్యం
- 1 కప్పు చొప్పున - చిక్కుడు, దోస, సొర, బీర ముక్కలు
- 1 కప్పు చొప్పున - వంకాయ, బెండకాయ, టమాటా ముక్కలు
- 1 కప్పు చొప్పున - బంగాళదుంప, చిలగడదుంప ముక్కలు
- ఆరు చెంచాలు - నెయ్యి
- చెంచా - అల్లం పేస్ట్
- తగినంత - పసుపు, ఉప్పు
- 3 చొప్పున - లవంగాలు, యాలకులు
- చిటికెడు - జాజికాయ పొడి
- చెంచా - జీలకర్ర
- అంగుళం ముక్క - దాల్చిన చెక్క
- అర కప్పు - జీడిపప్పు
- రెండు రెబ్బలు - కరివేపాకు
- కొద్దిగా - కొత్తిమీర తరుగు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత పేర్కొన్న కూరగాయలన్నీ అంగుళం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే.. వాటిల్లో ఏవైనా అందుబాటులో లేకుంటే వేరే కూరగాయలు లేదా శనగలు, పెసలు, అలసందలు లాంటివైనా వాడుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక.. జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు, అల్లం పేస్ట్, పసుపు, జాజికాయ పొడి, ఉప్పు, తరిగిన కూరగాయ ముక్కలు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
- ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కాసేపు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి. అవి కాస్త వేగాక.. నానబెట్టిన బియ్యం, ఆరు గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి.
- తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అనంతరం దింపుకొని కుక్కర్లో ఫ్రెజర్ పోయాక మూత తీసి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుంటే సరిపోతుంది.
- అంతే.. అమ్మవారికి ఇష్టమైన ఫలహారం "శాకాన్నం" రెడీ అవుతుంది!