Most Expensive Fabric in World : నార్మల్‌గా మనం ఏదైనా బ్రాండెడ్ జాకెట్ కొనాలంటే రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సిందే. ఇక జాకెట్ ప్రీమియం లుక్‌తో ఉంటే దాని ధర రూ.25 వేలకు పైమాటే ఉంటుంది. కానీ, ఒక ఫ్యాబ్రిక్‌తో చేసిన బేసిక్ మోడల్ జాకెట్ మీరు కొనాలన్నా తక్కువలో తక్కువ రూ.17 లక్షలు కావాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఆ జాకెట్‌ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తారు. ఈ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖరీదైన కశ్మీరీ నుంచి కాస్త అందుబాటులో ఉండే కాటన్, లినెన్, సిల్క్ వరకూ రకరకాల ఫ్యాబ్రిక్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది! వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో తయారీ విధానం, ఒక్కో స్పెషల్ ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత మృదువైన, అరుదైన ఫ్యాబ్రిక్‌గా 'వికూనా'కు (vicuna fabric) గుర్తింపు పొందింది. ఈ ఫ్యాబ్రిక్‌ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు. ఒకప్పుడు రాజకుటుంబీకులు మాత్రమే ఈ ఫ్యాబ్రిక్‌తో చేసిన దుస్తులు ధరించేవారట. అత్యంత పలుచగా, లేత బంగారు వర్ణంతో తళతళా మెరిసిపోయే ఈ ఉన్ని ఒక మీటరు ధర సుమారు రూ.4 లక్షలకు పైమాటే. అంటే ఈ ఫ్యాబ్రిక్‌తో చేసిన బేసిక్ మోడల్ జాకెట్ కొనాలన్నా తక్కువలో తక్కువ రూ.17 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే!
డిమాండ్ మామూలుగా ఉండదు!
'వికూనా' అనేది ఒంటె జాతికి చెందిన ఓ అటవి జీవి. కాస్త పొట్టిగా, చలాకీగా ఉండే ఈ జాతి జీవులు దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత సానువుల్లో మాత్రమే జీవిస్తాయి. 3200-4800 మీటర్ల ఎత్తయిన ప్రదేశాల్లో నివసిస్తూ, అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. రాత్రిళ్లు టెంపరేచర్ మైనస్‌ల్లోకి పడిపోయినా, వీటి చర్మంపైన ఉండే ఉన్ని పొరలు వేడిని పట్టి ఉంచుతాయట. ఈ జీవుల ఉన్ని ఆ ప్రత్యేక లక్షణం కలిగి ఉండటంతో పాటు సంవత్సరంలో ఒక వికూనా నుంచి కేవలం 500 గ్రాముల ఉన్ని మాత్రమే ఉత్పత్తి అవుతుందట. ఆ లెక్కన ఒక జాకెట్ (కోటు)ను రెడీ చేసేందుకు కనీసం 25 జీవులు అవసరమవుతాయన్నమాట.