Ginger Lemon Rasam Recipe :మనలో చాలా మందికి పప్పు చారు అంటే ఎంత ఇష్టమో రసం కూడా అంతే ఇష్టం. ఈ క్రమంలోనే ఎక్కువ మంది టమాటా రసం, పచ్చిపులుసు వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి రసం వేసుకొని అన్నం తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ వేరే లెవల్. అయితే, ప్రస్తుతం వింటర్ సీజర్ నడుస్తుండడంతో చాలా మంది జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు.
అలాంటి వారికి ఏం తిన్నా నోటికి రుచించదు. అలాంటి టైమ్‌లో ఓసారి ఇలా "అల్లం నిమ్మకాయ చారు" చేసుకొని చూడండి. టేస్ట్ అమృతంలా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! అంతేకాదు నచ్చితే ఎంచక్కా నేరుగానూ తాగేయొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - పిడికెడు
- కరివేపాకు కాడలు - 6
- పసుపు - పావుటీస్పూన్
- పండిన టమాటా - 1(పెద్ద సైజ్ది)
- అల్లం - ఒకటిన్నర అంగుళాల ముక్క
- నల్ల మిరియాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 6 నుంచి 7
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - 3 టేబుల్‌స్పూన్లు
- కొత్తిమీర - 1 చిన్నకట్ట
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- మెంతులు - 2 చిటికెళ్లు
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- అరగంట తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కందిపప్పు, కరివేపాకు కాడలు, పండిన టమాటాను అలాగే వేసుకొని అరలీటర్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికంచుకోవాలి.
- ఆ తర్వాత అందులోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి గరిటెతో ఆ మిశ్రమాన్ని వీలైనంత మెత్తగా మాష్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని జల్లెడ సహాయంతో మరో గిన్నెలోకి ఉంచి వడకట్టుకోవాలి. ఆపై జల్లెడలో ఉన్న పప్పు మిశ్రమాన్ని గరిటెతో వత్తుకోవాలి. వడకట్టుకున్నాక వచ్చిన ఆ పల్చని చారుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా తరుక్కున్న అల్లంముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై గిన్నె పెట్టుకొని అందులో ముందుగా వడకట్టి పక్కన పెట్టుకున్న దాల్ వాటర్, మిక్సీ పట్టుకున్న అల్లం ధనియాల ముద్ద, రాళ్ల ఉప్పు వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరీ, ఎక్కువగా మరిగించుకుంటే మిరియాలు, అల్లం ఘాటు తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.
- ఆవిధంగా మరిగించుకున్నాక వెంటనే స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం కాడలతో సహా తరుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు అందులోకి తాలింపుని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు వేగాక దాన్ని తీసుకొని ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న చారులో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే" అల్లం నిమ్మకాయ రసం" రెడీ!
ఇవీ చదవండి :
వింటర్ స్పెషల్ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్‌గా తాగేస్తారు కూడా!
నిమిషాల్లో ఘుమఘుమలాడే "మైసూర్ రసం" - ఇలా చేశారంటే సూపర్ టేస్ట్ పక్కా!