Legal Advice on Property Rights :కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద మమకారంతో.. అలాగే వారు చివరి వరకు తమ బాగోగులు చూస్తారనే భరోసాతో ముందే ఆస్తి మొత్తం వారి పేరుమీద రాసిస్తుంటారు. ఆస్తులు మాత్రమే కాకుండా.. తమ వద్ద ఉన్న బంగారం, డబ్బులు అన్నీ సమానంగా పంచేస్తుంటారు. కానీ.. కొందరు పిల్లలు ఆస్తి పంపకాలు పూర్తైన తర్వాత తల్లిదండ్రుల మంచీచెడు చూడడం మానేస్తుంటారు. దీంతో అందరూ ఉన్న కూడా వృద్ధాప్యంలో ఆ దంపతులు అనాథలుగా మిగిలిపోతారు.
దయతో పిల్లల్ని తమ బాగోగులు చూడమని అడిగితే.. బాధ్యతలు తీసుకోవడం అటుంచితే.. వృద్ధాశ్రమంలో చేరమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతుంటారు.
ఇలాంటి పరిస్థితే ఓ వృద్ధ జంటకు ఎదురైంది. ఆస్తి పంపకాల తర్వాత పిల్లలు వారిని గురించి పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుంచి పెన్షన్‌తోనే జీవితం గడుపుతున్నారు. వారిలో తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డారు. దీంతో మెడిసిన్, వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి. ఈ అవసరాలకు పెన్షన్ డబ్బులు ఎటూ సరిపోవడం లేదని.. తమ ఆస్తి వెనక్కి తీసుకుంటేనైనా వారికి బుద్ధి వస్తుందేమోనని, ఆ అవకాశం ఉందా? అని న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసుకుందాం.
ఇది చాలా బాధకరం..
తల్లిదండ్రులకు.. కన్నబిడ్డల మీద ప్రేమ, మమకారం, అప్యాయత అనేవి చివరి వరకు ఉంటాయి. కానీ.. మీరు ఆస్తి రాసిస్తే తమ బాగోగులు చూస్తారనే భరోసాతో ప్రాపర్టీనంతా ముందుగానే బిడ్డలకి పంచి ఇచ్చి పొరపాటు చేశారు. ప్రస్తుత జనరేషన్లో ఉన్న కొంతమంది తమకున్న బాధ్యతలు వేరనీ, కన్నవాళ్ల పోషణ భారమనీ భావిస్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయమని న్యాయవాది వరలక్ష్మి చెబుతున్నారు.
"ఇలా తల్లిదండ్రుల మంచిచెడులు చూడని వారి కోసం.. ప్రభుత్వం సీనియర్ 'సిటిజన్స్ యాక్ట్-2007' తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న పేరెంట్స్‌ని పోషించే బాధ్యత పిల్లలదే. ఈ యాక్ట్ బిడ్డలు ఆస్తులకోసం కన్నవాళ్లను హింసించకుండా కాపాడుతుంది."-జి.వరలక్ష్మి, న్యాయవాది