Legal Advice on Family Property Dispute :ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ బెట్టింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎలాంటి కష్టం లేకుండా దండిగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో చాలా మంది ఆన్‌లైన్ ఆటలకు అలవాటుపడిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అప్పుల మీద అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి. ఇలాంటి ఘటనే ఈ ఫ్యామిలీలోనూ చోటుచేసుకుంది. దాంతో భర్త చేసిన అప్పుల్నీ తాను తీర్చాలా? ఆయన పేరున ఉన్న ఆస్తి అమ్ముదామంటే అత్తగారు ఒప్పుకోవడం లేదని.. పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ మహిళ. ఇంతకీ, ఆమె అసలు సమస్య ఏంటి? దీనికి న్యాయ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇదీ సమస్య..
ఈ మధ్యనే మా వారు ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. చాలా చోట్ల అప్పులు చేశారట. అయితే, నా భర్త పేరున రెండెకరాల పొలం ఉంది. దాన్ని అమ్మి ఆ అప్పుల్ని తీర్చేద్దామంటే.. మా అత్తగారు అందుకు ఒప్పుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. మా ఆడపడుచు ఏమో నేనూ తమ్ముడికి బోలెడు డబ్బులు ఇచ్చాను. దాంతో ఆ ఆస్తిని తన పేరున రాయమంటోంది. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు? అని ఓ మహిళ అడుగుతున్నారు. మరి, ఈ సమస్యకు ప్రముఖ న్యాయ నిపుణులు జి. వరలక్ష్మీ ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ భర్త పేరున ఉన్న ఆస్తిలో మీకు వాటా వస్తుంది. అలాగే మీవారు మీ ఆడపడుచు డబ్బులు ఇచ్చినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఆస్తి మీద వచ్చే సొమ్ముతో తీర్చుకోవచ్చు. అదేవిధంగా మీ భర్త ఎవరెవరి దగ్గర, ఎంతెంత అప్పు తీసుకున్నారో కనుక్కోండి. వాటికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండని చెబుతున్నారు న్యాయవాది జి. వరలక్ష్మీ.
ఆ ఆలోచన మానుకోండి!
"ఉన్న ఆస్తిని అమ్మితే రేపు పిల్లల్ని ఎలా పోషిస్తారు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం.. మగవారు ఎవరైనా వీలునామా రాయకుండా మరణిస్తే.. అతడి ఆస్తి క్లాస్ 1 హెయిర్స్ అంటే భార్య, పిల్లలు, తల్లికి చెందుతుంది. దాని ప్రకారం చూస్తే.. మీ భర్త పేరున ఉన్న రెండెకరాల పొలం మీకు కానీ, మీ అత్తగారికి కానీ సొంతం కాదు. మీ బిడ్డలు కూడా దానికి వారసులే. కాబట్టి ఆ పొలాన్ని అమ్మి అప్పు తీర్చాలనే ఆలోచన మానుకోండి." - వరలక్ష్మీ, న్యాయవాది
ఆవిడకు దానిపై పూర్తి హక్కు లేదు!