Jeera Rasam Recipe in Telugu :కొందరికి భోజనం చివర్లో పులుసు లేదా చారు లేకపోతే కడుపునిండా తిన్నామన్నా ఫీలింగ్ కలగదు. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువగాటమాటా చారు, పప్పు చారు, సాంబార్ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే రుచిలో తినాలంటే ఎవరికైనా బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అలాకాకుండా ఓసారి ఇలా "జీలకర్ర రసం" చేసుకొని చూడండి. చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ చారు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. పిల్లలూ ఈ రసంతో అన్నం ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
- కందిపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 8 నుంచి 10
- టమాటా - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నూనె - 2 టీస్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- ఇంగువ - పావు చెంచా
- కొత్తిమీర తరుగు - 2 టీస్పూన్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్లో చింతపండును నానబెట్టుకోవాలి. ఆలోపు రెసిపీలోకి కావాల్సిన టమాటాను సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అరగంట తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న జీలకర్రమిశ్రమాన్ని వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే, నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి రెడీగా పెట్టుకోవాలి.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిశ్రమం, టమాటా ముక్కలు, కరివేపాకు, చింతపండు రసం, 750ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై పసుపు, ఉప్పు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ మీద ఆ గిన్నెను ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆపై ఉప్పు రుచి చూసి దింపి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు చారుకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆ తర్వాత ఇంగువ వేసి కాసేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం ఈ తాలింపుని వెంటనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారులో వేసి కలిపి మూతపెట్టి 30 సెకన్ల పాటు అలా ఉండనివ్వాలి.
- ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే "జీలకర్ర రసం" రెడీ!
- దీన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతః అనేలా ఉంటుంది. మరి, నచ్చిందా మీరు ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి.
ఇవీ చదవండి :
సీజనల్ స్పెషల్ - ఘాటైన రుచితో "ఉసిరికాయ రసం" - ఇలా చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు!
వింటర్ స్పెషల్ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్‌గా తాగేస్తారు కూడా!