Best Tips for Old Sweater Looks New : రోజురోజుకి చలితీవ్రత పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు బీరువాలో ఎక్కడో దాచిన స్వెటర్లను బయటకు తీస్తుంటారు. అయితే, చాలా రోజులు అవి కబోర్డ్‌లో ఉండటంతో పాతగా అనిపించొచ్చు. అంతేకాదు కొందరికి గత సంవత్సరం వేసుకున్న వాటిని ఇప్పుడు ధరించాలంటే బోర్‌గా ఉంటుంది. అలాకాకుండా కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే పాత స్వెటర్లకుకొత్త లుక్ తీసుకురావొచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాత రేజర్‌తో..
స్వెటర్స్ లేదా ఉన్ని దుస్తులనుఎక్కువగా వాడినా, అలాగే ఎక్కువ రోజులు వినియోగించకుండా ఉంచినా వాటిపై ఊలు దారాలు బయటికి వచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా నచ్చిన కలర్ అంటూ కొనుక్కున్న స్వెటర్ ఒక్క ఉతుక్కే పీచు బయటికి వస్తే పాతదిగా మారిపోతుంది. అలాగని దాన్ని వదిలేయడానికి మనసు ఒప్పదు. అలాంటి టైమ్‌లో ఈ టిప్ పాటిస్తే తిరిగి కొత్తదానిలా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం సమాంతరంగా ఉన్న ఒక టేబుల్‌పై పీచు పైకి తేలిన ప్లేస్ కనిపించేలా స్వెటర్‌ను పరవాలి. ఆపై ఒక పాత రేజర్ తీసుకొని వ్యతిరేక దిశగా పీచు లేదా ఊలు దారాలను పైపైన తీసేస్తూ వెళ్లండి. అప్పుడు దానిపై తేలే పీచు, ఊలు దారాలు పోయి కొత్తదానిలా కనిపిస్తుందట.
పోగులు తేలితే ఇలా చేయండి..
పాత స్వెటర్స్ మీద చాలా వరకు దారపు పోగులు తేలడం, పీచులు పైకి రావడం జరుగుతుంటుంది. అలా స్వెటర్‌పై దారపు పోగులు ఉండల్లా కనిపిస్తే వాటిని తొలగించడానికి మార్కెట్లో లింటిరిమూవర్స్ వస్తున్నాయి. దాంతో ఈజీగా స్వెటర్‌పై తేలిన దారాల పోగులను తొలగించుకోవచ్చు. అలా కాదంటే గుండ్రంగా, పొడవుగా ఉండే సీసా లేదా చిన్న సిలిండర్ ఆకారంలోని వస్తువును తీసుకుని దానిపై టేప్ చుట్టాలి. అయితే, స్వెటర్‌పై దాన్ని రోల్ చేసేటప్పుడు వస్త్రానికి టేప్ తాకేలా ఉండాలి. అప్పుడు మీరు దానితో రోల్ చేసినప్పుడు అదనంగా ఉండే ఉండల్లాంటి ఊలు టేప్‌నకు అంటుకుంటుంది. అలా అంటిన ఊలును ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. లేదంటే కోట్లు, సూట్స్ క్లీన్ చేసే బ్రష్‌ను యూజ్ చేసి కూడా స్వెటర్‌పై ఉండే దారం ముక్కలను తొలగించొచ్చంటున్నారు.