How To Make Ragi Vada Recipe : బ్రేక్‌ఫాస్ట్‌లో వేడివేడిగా వడలు తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే వడలను పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ కాంబినేషన్‌తో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. వడలు చేయాలంటే ముందు రోజు రాత్రే మినపప్పుని నానబెట్టి.. రాత్రి రుబ్బి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వడలు చేయొచ్చు. అయితే, పప్పు రుబ్బకుండా కూడా.. అప్పటికప్పుడు వడలను చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? మీ ఇంట్లో రాగి పిండి, బొంబాయి రవ్వ, పెరుగు ఉంటే సరిపోతుంది. ఇవి ఉంటే చాలు క్షణాల్లోనే హెల్దీ రాగి వడలను చేసేసుకోవచ్చు. ఈ వడలు తయారు చేయడానికి చాలా శ్రమ పడాల్సిన పనేలేదు. మరి.. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాగి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ- కప్పు
- రాగి పిండి- ఒకటిన్నర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ- ఒకటి (సన్నగా కట్ చేసుకోవాలి).
- పచ్చిమిర్చి-3 (సన్నగా కట్ చేసుకోవాలి)
- పెరుగు - ఒకటిన్నర కప్పు
- కరివేపాకు-1
- కొద్దిగా కొత్తిమీర
రాగి వడలు తయారు చేసే విధానం :
- ముందుగా మిక్సీ జార్లో బొంబాయి రవ్వ వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇలా బొంబాయి రవ్వ కొద్దిగా వేసుకోవడం వల్ల గారెలు మెత్తగా వస్తాయి.
- తర్వాత ఒక బౌల్లోకి రాగి పిండి, గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి.
- తర్వాత ఇందులోకి నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి.
- పిండి మరీ జారుగా కాకుండా, కాస్త గట్టిగానే కలుపుకోండి.
- తర్వాత పాన్‌లో వడలు వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకుని, వడలను ఆయిల్లో వేసి బాగా వేయించుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా ఎలాంటి పప్పు రుబ్బకుండానే, అప్పటికప్పడు వడలు చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఈ వడలను ట్రై చేయండి.
- ఈ వడలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లోకి, అలాగే సాయంత్రం స్నాక్స్‌లోకి కూడా రెడీ చేసుకుని తినొచ్చు.