How to Make Dry Rasgulla :మనలో చాలా మంది చిన్నతనంలో తేనె మిఠాయిలు తినే ఉంటారు. వీటినే డ్రై రసగుల్లాలు అని కూడా వీటిని పిలుస్తారు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఇవే ఎంతో రుచికరంగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగే ఈ మిఠాయిలు90's కిడ్స్‌కి చాలా ఫేవరెట్. అయితే, ప్రస్తుత కాలంలో ఇవి ఎక్కువగా దొరకడం లేదు. కాబట్టి ఇంట్లోనే సింపుల్‌గా ఈ తేనె మిఠాయిలను తయారు చేసుకోండి. ఇక ఈ జనరేషన్ పిల్లలకు ఇస్తే ఇష్టంగా తినేస్తారు. మరి వాటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- మైదా పిండి-కప్పు
- కార్న్‌ఫ్లోర్ -టీస్పూన్
- బేకింగ్ పౌడర్-అర టీస్పూన్
- పంచదార-కప్పు
- నీళ్లు-ముప్పావు కప్పు(3/4)
- ఫుడ్ కలర్-పావు టీస్పూన్
- నిమ్మరసం-2 టేబుల్‌స్పూన్లు
- ఆయిల్ -డీప్ ఫ్రైకి సరిపడా
- యాలకుల పొడి-అరటీస్పూన్
తయారీ విధానం..
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి జల్లించి తీసుకోవాలి. అలాగే కార్న్‌ఫ్లోర్, చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్ కూడా జల్లించుకోవాలి. (బేకింగ్ పౌడర్‌కి బదులుగా వంటసోడా కూడా యూజ్ చేయవచ్చు)
- ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ సాఫ్ట్‌గా పిండి ముద్దను చేసుకోవాలి.
- తర్వాత కొద్దిగా నూనె వేసి.. పిండి ముద్దను కలిపి మూత పెట్టాలి.
- ఇప్పుడు పంచదార పాకం కోసం.. స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో నీళ్లు పోసి పంచదార వేసి కరిగించండి.
- ఈ తేనె మిఠాయి కోసం పంచదార పాకం.. గులాబ్ జామున్ పాకానికి ఎక్కువగా, తీగ పాకానికి తక్కువగా ఉండాలి.
- పాకం రెడీ అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి స్టౌ ఆఫ్ చేసి మూత పెట్టండి.
- ఇప్పుడు రసగుల్లాలు చేయడానికి పిండిని మరోసారి మిక్స్ చేయాలి.
- కొద్దిగా పొడి పిండి చల్లి చపాతీ కర్రతో కాస్త మందంగా చపాతీలాగా చేసుకోవాలి.
- ఇప్పుడు క్యాప్ సహాయంతో చిన్నగా రసగుల్లాలుగా చేసుకోవాలి.
- తేనె మిఠాయిలను ఫ్రై చేయడానికి స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో సరిపడా నూనె వేసి వేడి చేయండి.
- ఆయిల్ వేడైన తర్వాత రసగుల్లాలను ఒక్కోటిగా వేస్తు బాగా ఫ్రై చేసుకోండి. రసగుల్లాలు వేగిన తర్వాత వాటిని గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు అలా వదిలేయండి.
- తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తినండి. అంతే టేస్టీగా ఉంటాయి.
- ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా పిల్లలకు ఈ విధంగా తేనె మిఠాయిలు చేసి పెట్టండి.
కరకరలాడే 'పిచ్చుక గూళ్లు' - ఈ వెరైటీ స్వీట్ మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్" - ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్ టేస్ట్!