Healthy Bottle Gourd Chapati: 'ఆరోగ్యం కోసం చపాతీ!' కానీ, ఎప్పుడూ చపాతీ తిని బోర్ కొడుతోందా? చపాతీనే కొత్తగా రుచికరంగా తయారు చేయాలనుకుంటున్నారా? అందుకే ఇవాళ కొత్తగా సొరకాయ చపాతీ తయారీ ఎలాగో తెలుసుకుందాం. ఇది దూది కంటే మెత్తగా ఉంటుంది. పెరుగుతో తింటే మీ కడుపు ఎంతో చల్లగా ఉంటుంది. అంతేకాదు సొరకాయ చపాతీ మీ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
సాధారణ చపాతీలు టైమ్ గడుస్తున్నా కొద్దీ గట్టి పడతాయి. కాస్త నూనె ఎక్కువగా వేసి కాల్చితే మృదువుగానే ఉంటాయి కానీ, చాలా మందికి నూనె సహించదు. అందుకే సొరకాయ చపాతీకి కొద్దిగా నూనె వేస్తే చాలు గంటల తరబడి మెత్తగా ఉండడం వల్ల లంచ్ బాక్సుల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం సొరకాయ చపాతీ తయారీ ఎలాగో తెలుసుకుందామా!
healthy_bottle_gourd_chapati (ETV Bharat) కావలసిన పదార్థాలు :
- సొరకాయ - 1
- పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగినవి)
- అల్లం తురుము - కొద్దిగా
- ఉప్పు - 1 టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- కారం - ఒకటిన్నర టీస్పూన్
- ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- ఆమ్చూర్ పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
- గరం మసాలా - 1 టీస్పూన్
- వాము - పావు టీస్పూన్
- కసూరీ మేథీ - 1 టేబుల్ స్పూన్
- గోధుమపిండి - 2 కప్పులు
- నూనె - కాల్చడానికి సరిపడా
- నెయ్యి - కొద్దిగా
- ఈ టిప్స్ పాటిస్తే బాగుంటుంది
- సొరకాయ తురుము పిండిలో వేసి బాగా కలిపిన తరువాత కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పిండిని మెత్తగా వత్తుకోవాలి.
- పచ్చిమిర్చి సన్నని తరుగు లేదంటే మిక్సీ పట్టి వేసుకోవచ్చు.
తయారీ విధానం :
- ముందుగా సొరకాయ తొక్క తీసేసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి
- ఒక వెడల్పాటి గిన్నెలో సొరకాయ తురుముతో పాటు మిగతా పదార్థాలు (పచ్చిమిరపకాయలు (పేస్ట్), అల్లం తురుము, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆంచూర్ పొడి, గరం మసాలా పొడి, వాము, కసూరీ మేథీ) , గోధుమ పిండి వేసి కలుపుకోవాలి.
- సొరకాయలో నీళ్ల శాతం ఎక్కువే కాబట్టి ముందుగా నీళ్లు పోసుకోకుండానే పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్లు చిలకరిస్తూ కొద్దిగా నూనె వేసి పిండి ముద్దను తయారు చేసుకోవాలి.
- పిండి మిశ్రమం చేతులకు అంటుకోకుండా పొడి పిండి చల్లుకోవచ్చు
- పిండి మిశ్రమాన్ని చపాతీలుగా వత్తుకునేందుకు చిన్న ఉండలుగా తయారుచేసుకోవాలి.
- పీటపై పిండి చల్లుకుంటూ మామూలు చపాతీల్లానే ఒత్తుకోవాలి.
- మరోవైపు పెనాన్ని వేడి చేసి వెంటనే ఈ సొరకాయ చపాతీలు వేసి, రెండు వైపులా నెయ్యి రాసి కాల్చుకోవాలి.
- చపాతీలు రెండు వైపులా సరిగ్గా కాల్చుకుంటే సరిపోతుంది.
- సొరకాయ చపాతీలు వేడివేడిగా ఏదైనా పచ్చడి లేదా పెరుగుతో అయితే ఇంకా బాగుంటాయి.
ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? - రాగిపిండితో ఇలా చేయండి - ఫ్యామిలీ అంతా మీకు ఫ్యాన్స్ అవుతారు!
పిండిలో ఈ ఒక్కటి వేస్తే చాలు - చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి!