How to Make Bagara Rice and Chicken Curry :దసరా.. అంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే. ముక్క లేనిదే పండగ పూర్తయిన ఫీలింగ్ రాదు. అందుకే పండగనాడు అందరి ఇళ్లల్లో మసాలా ఘుమఘుమలు అద్దిరిపోతాయి. చికెన్, మటన్, చేపలు.. ఒక్కటేమిటి నచ్చినవి వండుకుని తింటుంటారు. అయితే.. చాలామంది ఇళ్లళ్లో చేసే కాంబినేషన్ మాత్రం బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఈ రెసిపీని ఎలా వండినా టేస్ట్ బాగుంటుంది. కానీ.. అద్భుతం అనిపించేలా ఉండాలంటే మాత్రం.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
బగారా రైస్‌కు కావాల్సిన పదార్థాలు:
- బాస్మతీ బియ్యం - 2 కప్పులు
- నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
- అనాస పువ్వులు - 2
- దాల్చిన చెక్క - 1 ఇంచ్
- మిరియాలు - అర టీ స్పూన్
- షాజీరా - 1 టేబుల్ స్పూన్
- లవంగాలు -6
- యాలకులు -6
- బూజు పువ్వు - కొద్దిగా
- ఉల్లిపాయ సన్నని తరుగు - అర కప్పు
- బిర్యానీ ఆకు - 2
- కరివేపాకు - 3 రెబ్బలు
- పచ్చిమిర్చి చీలికలు - కొద్దిగా
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- రుచికి సరిపడా - ఉప్పు
- వేడి నీరు - రెండున్నర కప్పులు
చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు:
మారినేట్ చేయడానికి:
- చికెన్ - కేజీ
- పసుపు - అర టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- రుచికి సరిపడా - ఉప్పు
- నిమ్మరసం - అర చెక్క
మసాలా పొడి కోసం:
- దాల్చిన చెక్క - 2 అంగుళాలు
- యాలకులు - 4
- లవంగాలు - 6
- మిరియాలు - అర టీ స్పూన్
- ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టీ స్పూన్
- గసగసాలు - 1 టేబుల్ స్పూన్
- కొబ్బరి పొడి - అర కప్పు
- నూనె - పావు కప్పు
- కరివేపాకు - 2 రెబ్బలు
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- పచ్చిమిర్చి చీలికలు - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్
- టమాటలు - 3
- కారం- 1 టేబుల్ స్పూన్
- వేడి నీరు - 2 కప్పులు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్ తీసుకుని అందులోకి చికెన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ముక్కకు మసాలా పట్టేలా మారినేట్ చేసి చివరకు అర చెక్క నిమ్మరసం కలిపి ఓ గంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అనాస పువ్వులు, దాల్చినచెక్క, మిరియాలు, షాజీరా, లవంగాలు, యాలకులు, బూజు పువ్వు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.
- అనంతరం నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని నీళ్లు లేకుండా కుక్కర్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెతుకు విరగకుండా ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత కప్పు బియ్యానికి ఒకటింపావు కప్పు నీళ్లు పోసుకోవాలి. అంటే రెండు కప్పుల బియ్యానికి రెండున్నర కప్పుల వేడి నీరు పోసి కలిపి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్..
- అందుకోసం ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి గసగసాలు, కొబ్బరిపొడి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి.
- ఉల్లిపాయ మెత్తగా మారి రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి మారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని హై ఫ్లేమ్ మీద చికెన్‌లో నీరు ఇంకి పోయి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కావడానికి సుమారు 15 నిమిషాల టైమ్ పడుతుంది.
- ఆ తర్వాత అందులోకి టమాట సన్నని తరుగు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంటే సుమారు 10 నిమిషాలు చికెన్ కుక్ చేసుకోవాలి.
- ఇప్పుడు అందులోకి కారం, గ్రైండ్ చేసుకున్న మసాల పొడి వేసి బాగా కలిపి చికెన్ ముక్కలకు మసాలా పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
- నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకున్న తర్వాత రెండు కప్పుల వేడి నీరు పోసి కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నూనె పైకి తేలేంతవరకు అంటే సుమారుగా 20 నిమిషాలు మగ్గించుకోవాలి.
- ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం చూసుకుని చివరగా కొత్తిమీర వేసి దింపుకుంటే టేస్టీ అండ్ జ్యూసీ చికెన్ కర్రీ రెడీ. ఒకవేళ కారం అనిపిస్తే కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరి.
గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ సూపర్!
సూపర్ టేస్టీ "రెస్టారెంట్ స్టైల్ చికెన్ థాలీ" - చాలా తక్కువ టైమ్‌లో ప్రిపేర్ చేసుకోండిలా! - ఆదివారం అద్దిరిపోతుంది!