తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మాంసం ఉడకట్లేదా? కూరల్లో కారం, స్వీట్స్​లో తీపి ఎక్కువైందా? - ఈ టిప్స్​ పాటిస్తే ఆల్​సెట్​! - HOW TO COOK MEAT QUICKLY IN TELUGU

వంటల్లో కారం, పులుపు ఎక్కువైందా? ఈ టిప్స్​ పాటించమంటున్న నిపుణులు

How to Cook Meat Quickly in Telugu
How to Cook Meat Quickly in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 3:12 PM IST

How to Cook Meat Quickly in Telugu:ఏ కూరలోనైనా కారం, ఉప్పు, మసాలాలు, పసుపు ఇలా అన్ని పదార్థాలు సరిగ్గా వేస్తేనే రుచి బాగుంటుంది. అలా ఉన్నప్పుడే తృప్తిగా తింటుంటాం. కానీ, అనుకోకుండా కొన్నిసార్లు ఏదో ఒకటి తక్కువవడమో, ఎక్కువవడమో జరుగుతుంటుంది. తక్కువైతే వేసుకోవచ్చు కానీ, ఎక్కువైతేనే అసలు సమస్య. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఆ కూరలను పడేస్తుంటారు. అటువంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​ అంటున్నారు నిపుణులు. కేవలం కూరలో కారం, ఉప్పు, మాత్రమే కాదు స్వీట్స్​లలో తీపి ఎక్కువైనా, మాంసం సరిగ్గా ఉడకకపోయినా ఈ టిప్స్​ పాటిస్తే బ్యాలెన్స్​ చేసుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

ఎంత ముదిరిన మాంసం అయినా: కొన్ని సందర్భాల్లో చికెన్‌ లేదా మటన్‌ ఎంత సేపు ఉడికించినా ఉడకదు. చికెన్​ అన్నా కొద్దిసేపటికి ఉడుకుతుందేమో కానీ, ముదిరిన మటన్​ ఉడికేలోపు ఉన్న సమయం కాస్త అయిపోతుంది. అయితే ఉడికీ ఉడకకుండా ఉన్న కూర అంతగా రుచించదు. ఫలితంగా కర్రీ మొత్తం వృథా అయ్యిందే అని బాధపడుతుంటారు. అలాంటి సమయంలో ఈ చిట్కాను పాటించమంటున్నారు. ముదిరిన మాంసం వండే ముందే దానికి మసాలా, కాస్త పెరుగు కలిపి ఓ గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత కుక్​ చేయమంటున్నారు. లేదంటే మాంసాన్ని ఉడికించే క్రమంలో కొద్దిగా పచ్చి బొప్పాయి ముక్కను చేర్చినా.. ముక్క మెత్తగా ఉడికి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరుగుతుందని అంటున్నారు.

తీపి తగ్గాలంటే:ఇంట్లో స్వీట్స్‌ ప్రిపేర్​ చేసేటప్పుడు కొన్ని సార్లు వేయాల్సిన చక్కెర కంటే ఎక్కువే పడొచ్చు. ఇక తీపి ఎక్కువైన పదార్థాలను కొంచెం తినగానే మొహం మొత్తేస్తాయి. అలాంటి సమయంలో వాటిలో కాస్త నిమ్మరసం కలిపితే ఫలితం ఉంటుందని అంటున్నారు. అలాగే వెనిగర్‌ని కూడా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. అయితే వీటిని మరీ ఎక్కువగా కలపకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

అన్నం పొడిపొడిగా: కొన్నిసార్లు నీళ్లు ఎక్కువైతే అన్నం మెత్తబడుతుంది. దీంతో ఆ అన్నాన్ని తినలేరు. పారేయడానికి మనసు ఒప్పదు. అయితే వండే ముందే చెంచా చొప్పున నూనె, నిమ్మరసం కలిపితే.. అన్నం పొడిగా, తెల్లగా కూడా ఉంటుంది. ఒకవేళ ఉడికిన తర్వాత మెత్తగా అనిపిస్తే వెంటనే ఓ ప్లేట్​లోకి తీసి ఫ్యాన్​గాలికి కొద్దిసేపు చల్లారనిచ్చినా పొడిపొడిగా అవుతుందని అంటున్నారు.

కారం తగ్గడానికి: కూర కాస్త కారంగా ఉంటేనే ఎక్కువమంది తింటుంటారు. అలా అని మరీ కారంగా ఉంటే సమస్య తప్పదు. అయితే ఈసారి కూరలో కారం ఎక్కువైనప్పుడు చెంచా చక్కెర కలిపితే.. ఎంతటి కారంమైనా ఇట్టే తగ్గిపోతుందని అంటున్నారు. చక్కెర కలపడం వల్ల రుచి మారుతుందనుకునేవారు నిమ్మరసం పిండుకోవచ్చంటున్నారు. లేదంటే టమాటలను నూనెలో వేయించి మెత్తగా రుబ్బి కూరలో కలిపినా సరిపోతుందని చెబుతున్నారు.

పులుపు ఎక్కువైతే: కొంతమందికి పులుపంటే మహా ఇష్టం. మరికొందరు పులుపు తగిలితే ఆ పదార్థాన్ని తినలేరు. అయితే, కొన్నిసార్లు చింతపండు ఎక్కువ వేయడం వల్ల కూరల్లో పులుపు ఎక్కువైపోతుంది. దీంతో పులుపుని ఇష్టపడేవారు కూడా ఆ సమయంలో తినలేరు. అలాంటప్పుడు బెల్లం వంటి కాస్త తియ్యగా ఉండే పదార్థాన్ని జోడిస్తే పులుపు తగ్గిపోతుందని అంటున్నారు. లేదా ఉప్పు కలిపినా సరిపోతుందని చెబుతున్నారు. అయితే ఉప్పు కలిపేటప్పుడు రుచి చూసుకుంటూ కలుపుకోవడం వల్ల ఎక్కువ కాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.

తెచ్చిన కొన్ని రోజులకే "గోధుమ పిండి"కి పురుగు పడుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ రోజులు తాజాగా!

కూరగాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసినా - కర్రీపై మూత పెట్టకపోయినా సమస్యే - ఆరోగ్యానికీ ముప్పేనట!

ABOUT THE AUTHOR

...view details